
ఆకాశంలో బీభత్సానికి ఐసిస్ ప్లాన్
- వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు ఉగ్రసంస్థ కొత్త ఎత్తుడడలు
మోసూల్: సిరియా, ఇరాక్లలోని తమ ప్రభావిత ప్రాంతంపై పట్టును పెంచుకునే క్రమంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ కొత్త ఎత్తుగడలను రచిస్తోంది. తన పాలిట వినాశనకారిగా మారిన వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు కొత్త తరహాలో ఆకాశ బాంబులను ప్రయోగిస్తోంది. పేలుడు పదార్థాలు, హైడ్రోజన్ ను ప్లాస్టిక్ సంచులు, కండోమ్లలో నింపి, ఆకాశంలోకి పంపి వాటి ద్వారా శత్రుదేశాల యుద్ధవిమానాలను నేల కూల్చడం ఎలాగో తన సైన్యానికి నేర్పుతోంది. దీనికి సంబంధించిన కీలక వీడియో ఒకటి ఇటీవలే వెలుగలోకి వచ్చింది.
అబూ అయూబ్ అల్ బాగ్ధాది అనే ఐసిస్ టెక్ శావి 'Dropping Fighter Jets in the Lands of the Islamic State' పేరుతో రూపొందిచిన వీడియోలో ఈ ఆకాశ బాంబుల తయారీకి సంబంధించిన వివరాలను పొందుపర్చారు. సాధారణంగా ఇంట్లో వాడుకునే వస్తువుల ద్వారా హైడ్రోజన్ వాయువును తయారుచేయడం మొదలు ప్లాస్టిక్ సంచుల్లో పేలుడు పదార్థాలను కూర్చడం, ఆ తర్వాత హైడ్రోజన్ ను నింపి, ఆకాశంలోకి వదలడం వరకు అన్ని విషయాలను పూసగుచ్చినట్లు వీడియోలో వివరించారారు. ఇలా తయారుచేసిన వందలకొద్దీ ఆకాశ బాంబులను తన గగనతలంలోకి పంపడం ద్వారా శత్రుదేశ యద్ధవిమానాలను రానీయకుండా చేయాలనేది ఐసిస్ ప్రణాళిక.
ఆకాశ బాంబుల్లో నింపే హైడ్రోజన్ పరిమాణాన్ని బట్టి రకరకాల ఎత్తుల్లో వీటిని మోహరింపజేస్తారు. అటుగా ఏదైన ఫైటర్ జెట్ దూసుకొచ్చి ఈ ప్లాస్టిక్ బ్యాగ్ లను తాకగానే పేలిపోతాయి. గత ఏడాది విడుదలైన కొన్ని వీడియోల్లో ఐసిస్ జిహాదీలు కొందరు పెద్ద ఎత్తున కండోమ్స్ గాలిలోకి ఎగురవేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే కండోమ్ పరిమాణం చిన్నది కావడంతో వాటి స్థానంలో మధ్య, పెద్ద స్థాయి ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పేలుడు పదార్థాలను పైకి వదులుతున్నారు. ఈ ఆకాశ బాంబుల ద్వారా ఇప్పటికే సిరియన్ ప్రభుత్వ దళాలకు చెందిన యుద్ధ విమానాన్ని నేల కూల్చినట్లు ఐసిస్ చెప్పుకుంటోంది.