మోసుల్ యుద్ధం: ఆర్మీ వలలో ఐసిస్ చీఫ్!
మోసుల్: గడిచిన మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థను సమూలంగా మట్టుపెట్టే దిశగా ఇరాకీ సైన్యం, అమెరికా వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ మోసుల్' కీలక ఘట్టానికి చేరుకుంది. రెండేళ్ల తర్వాత మొదటిసారి మోసుల్ నగరంలోకి ప్రవేశించిన సైన్యాలు.. ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చుట్టుముట్టినట్లు తెలిసింది.
తొమ్మిది నెలలుగా అజ్ఞాతంలో ఉంటోన్న అబూ బాగ్దాదీ.. తూర్పు మోసుల్ లోని ఓ ప్రాంతంలో ఉన్నాడన్న పక్కా సమాచారంతో బలగాలు అటుగా కదిలాయని, అతను తలదాచుకున్న ప్రాంతాన్ని ఆర్మీ రౌండప్ చేసిందని కుర్దిష్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫవూద్ హుస్సేన్ బుధవారం మీడియాకు చెప్పారు. కుర్దూ సైన్యాలు కూడా మరో వైపు నుంచి ఐసిస్ తో యుద్ధం చేస్తూనేఉంది. ఏక్షణమైనా సంకీర్ణ సైన్యాలు బాగ్దాదీని మట్టుపెట్టే అవకాశం ఉందని, అలా జరిగితే ఐసిస్ చరిత్ర ముగిసినట్లేనని హుస్సేన్ వ్యాఖ్యానించారు. అయితే ఒకవేళ బాగ్దాదీ ఇప్పుడున్న ప్రాంతం నుంచి తప్పించుకోగలిగితే మాత్రం యుద్ధం మరింత భీకరంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
టైగ్రీస్ నదికి రెండు వైపులా(తూర్పు, పడమర వైపునకు) విస్తరించిన మోసుల్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఐసిస్ ఖలీఫా రాజ్యాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇరాకీ సైన్యం మంగళవారం నాటికి మోసుల్ తూర్పు శివారులోని గాగ్ జాలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి వడివడిగా నగరంలోపలికి చొచ్చుకుపోయేందుఉ ప్రయత్నిస్తోంది. తూర్పు, పశ్చిమ మోసుల్ లను కలుపుతూ టైగ్రీస్ నదిపై ఐదు చోట్ల వంతెనలను ఉన్నాయి. ఒకవేళ ఐసిస్ గనుక ఈ వంతెనలను ధ్వంసం చేస్తే సైన్యాలు అటుగా వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయే అవకాశం ఉంది. ఐసిస్ ఉగ్రవాదులు ఆ పని చేయడానికి ముందే యుద్ధంలో పట్టుసాధించాలని ఇరాకీ సైన్యం ప్రయత్నిస్తోంది. వారికి సహకారంగా గగనతలం నుంచి అమెరికా యుద్ధవ విమానాలు ఐసిస్ స్థావరాలపై ఎడతెరపిలేకుండా దాడులు చేస్తూనేఉన్నాయి.