కర్ణాటక మంత్రి ఆస్తులపై ఐటీ దాడులు | IT raids on Karnataka minister Shivakumar | Sakshi
Sakshi News home page

కర్ణాటక మంత్రి ఆస్తులపై ఐటీ దాడులు

Published Thu, Aug 3 2017 2:47 AM | Last Updated on Tue, Oct 30 2018 5:50 PM

కర్ణాటక మంత్రి ఆస్తులపై ఐటీ దాడులు - Sakshi

కర్ణాటక మంత్రి ఆస్తులపై ఐటీ దాడులు

రూ. 10 కోట్ల నగదు, భారీగా ఆభరణాలు స్వాధీనం
♦  ఢిల్లీ, బెంగళూరులోని పలుచోట్ల సోదాలు.. ఈగల్‌టన్‌ రిసార్ట్‌లోని మంత్రి గదిలోనూ..
అధికారులకు దొరికిన కీలక పత్రాలు, చించేసిన కాగితాలు
ఇదే రిసార్ట్‌లో గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బస.. రాజకీయ కుట్రేనన్న కాంగ్రెస్‌..


సాక్షి, బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. బెంగళూరు క్యాంపులో ఉన్న 44 మంది గుజరాత్‌ ఎమ్మెల్యేల పర్యవేక్షణ బాధ్యత చూస్తున్న కర్ణాటక విద్యుత్‌ మంత్రి డీకే శివకుమార్‌ ఆస్తులపై బుధవారం ఐటీ శాఖ దాడులు నిర్వహించిం ది. శివకుమార్‌కు సంబంధించిన 64 వేర్వేరు ఆస్తులపై బుధవారం ఉదయం నుంచి జరిగిన సోదాల్లో రూ.10 కోట్లకు పైగా (ఇందులో మంత్రి ఢిల్లీ నివాసం నుంచి రూ.7.9 కోట్లు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి రూ. 2.23 కోట్లు) నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ దాడులపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. ఇవి రాజ కీయ కక్షసాధింపు చర్యలేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు, శివ కుమార్‌ బంధువైన ఓ ఉపాధ్యాయుడి కాలేజీ లాకర్‌ నుంచి కూడా భారీ మొత్తంలో ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పన్ను ఎగవేతకు సంబం« దించిన కేసులోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఎన్‌క్లేవ్, కర్ణాటకలోని హసన్, మైసూరులలో దొరికిన నగదును లెక్కించేందుకు ఆరు లెక్కింపు యంత్రాలను వినియోగిస్తున్నారు. రూ.కోట్ల నగదు, వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తుల పత్రాలు, పదుల కిలోల బంగారు, వెండి ఆభరణాలు వెలుగుచూసినట్లు సమాచారం.

ఉదయం 6:30 గంటలకు మొదలై..
బుధవారం ఉదయం దాదాపు 6:30 గంటలకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రోడ్‌లో ఉన్న డీకే శివకుమార్‌ ఇంటితో పాటు బెంగళూరులోని సదాశివనగర్, రామనగర జిల్లా కనకపురతో పాటు మైసూరు తదితర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, కార్యాలయాలకు ఐటీ అధికారులు సీఆర్‌పీఎఫ్‌ బలగాల రక్షణతో చేరుకుని కార్యాచరణ ప్రారంభించారు.

ఢిల్లీలోని ఇంట్లో బ్యాగుల్లో దాదాపు రూ.7.9 కోట్ల నగదును ఐటీ శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇందులో రద్దయిన రూ.1,000 నోట్లతో పాటు కొత్త రూ.2,000, రూ.500 నోట్లుపెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

లెక్కచూపని ఆస్తులపై దర్యాప్తు
పన్ను ఎగవేతతో పాటు రియల్‌ ఎస్టేట్, పలురంగాల్లో లెక్కచూపని భారీ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టారనే అంశాలపై.. సింగపూర్‌తోపాటు పలుదేశాల్లో శివకుమార్‌ పెట్టిన పెట్టుబడులపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన కొన్ని షెల్‌ కంపెనీలు, వాటి నిర్వహణపైనా దృష్టిపెట్టామన్నారు. ఈగల్‌టన్‌ రిసార్ట్‌లో మంత్రిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం పటిష్టమైన భద్రతతో బెంగళూరులోని నివాసానికీ మంత్రిని తీసుకొచ్చి విచారించారు.

అధికారులు రిసార్ట్‌కు వస్తున్నారన్న విషయం తెలుసుకుని కొన్ని కాగితాలను మంత్రి చించేశారని.. ఈ కాగితం ముక్కలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఈగల్‌టన్‌ రిసార్ట్‌లో ఉంచిన  గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కావాల్సిన సదుపాయాలను శివకుమార్‌ చూసుకుంటున్నారు. అయితే, ఈ రిసార్ట్‌లోని గుజరాత్‌ ఎమ్మెల్యేల గదుల్లోకి అధికారులు వెళ్లలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. రిసార్ట్‌లోని శివకుమార్‌ గదిలో మాత్రమే సోదాలు నిర్వహించామంది.

శివకుమార్, అతని కుటుంబసభ్యులకు సంబంధించిన 39 ప్రాంతాల్లో 120 మంది ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఇందుకోసం పారామిలటరీ బలగాల సాయం తీసుకున్నారు. దాడులు నిర్వహించాలని కొంతకాలం క్రితమే నిర్ణయించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. అయితే.. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచుతారని, దీని వల్ల వివాదం పెద్దదవుతుందని ఊహించలేదని చెప్పింది. శివకుమార్‌తో పాటు ఆయన తమ్ముడు, ఎంపీ డీకే సురేష్, మంత్రికి సన్నిహితుడైన ఎమ్మెల్సీ రవి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి.

రిసార్ట్‌లో ఆ ఎమ్మెల్యేలకు క్లాసులు
రిసార్ట్‌లోని ఎమ్మెల్యేలకు 60 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలు, బీజేపీ చేస్తున్న అసత్యాలపై క్లాసులు తీసుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలను పలు ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే.. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లుతుండటం, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంపై కొందరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో రిసార్ట్‌లోనే వీరికి ఈ క్లాసులను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఇది రాజ్యసభ ఎన్నికల కుట్ర..: కాంగ్రెస్‌
ఐటీ శాఖ దాడులపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పోటీచేస్తున్న అహ్మద్‌ పటేల్‌ ఈ దాడులను ఖండించారు. ఒక్క రాజ్యసభ సీటును గెలుచుకునేందుకు ఇన్ని కుట్రలు పన్నుతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. ‘కేంద్ర విచారణ సంస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఐటీ దాడులు బీజేపీ అసహనానికి నిదర్శనం’ అని పటేల్‌ విమర్శించారు.

 కాగా, రాజకీయ అనిశ్చితి సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటోందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఈ దాడుల వెనక కేంద్రం హస్తం ఉందన్నారు. ఐటీ అధికారులను, సీఆర్పీఎఫ్‌ బలగాలను రాజకీయ కుట్రలో భాగం చేసే హక్కు కేంద్రానికి లేదని.. ఇలాంటి ఒత్తిళ్లకు తమ పార్టీ భయపడదన్నారు. కర్ణాటకలో బలమైన ఒక్కలిగ కులానికి చెందిన శివకూమార్‌కు బెంగళూరు రూరల్‌తోపాటుగా రామనగర జిల్లాపై రాజకీయంగా మంచి పట్టుంది. 2018లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీకి ఈయన చీఫ్‌గా ఉన్నారు. ఐటీ దాడులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement