డోనాల్డ్ ట్రంప్ మాస్కులతో దోపిడీలు
రోమ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొంగలకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. 26, 30 ఏళ్లు కలిగిన విట్టోరియా, ఇవాన్ లఫోర్ అనే ఇద్దరు అన్నదమ్ములు డోనాల్డ్ ట్రంప్ ముఖాలు కలిగిన మాస్కులను ధరించి ఇటలీలోని పలు ఏటీఎంలను దోచుకున్నారు. దాదాపు 1,15,000 డాలర్ల విలువైన నగదును ఎత్తుకుపోయారు. వారు ఏటీఎంలలో జొరబడి ముందుగా సీసీటీవీ కెమేరాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఏటీఎంలలోకి పేలుడు పౌడరును పంపించి పేలుస్తారు. వాటి అరల్లో ఉండే నగదును ఎత్తుకుపోతారు.
ఈ ఇద్దరికి హాలివుడ్ సినిమాలను చూసే అలవాటు కూడా ఎక్కువగా ఉన్నట్లుంది. వారు దోపిడీచేసే విధానం చూస్తే రెండు హాలివుడ్ సినిమాలు గుర్తుకురాక తప్పవు. 1991లో విడుదలైన ‘పాయింట్ బ్రేక్’ చిత్రంలో కియాను రీవెస్, పాట్రిక్ స్వేజ్‌లు అమెరికా మాజీ అధ్యక్షుల మాస్కులు ధరించి బ్యాంకులను దోచుకుంటారు. ఇక్కడ విట్టోరియా, ఇవాన్‌లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి మాస్కులను ధరించారు. ఇక 1997లో విడుదలైన ‘ది జాకాల్’ చిత్రంలో హీరో బ్రూస్ విల్లీస్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన కారు రంగు మారుస్తాడు. ఇక్కడ విట్టోరియా, ఇవాన్‌లు తమ తెల్లరంగు మెర్సిడెస్ కారుకు నల్లరంగు వేశారు.
ఎవరి మాస్కులు ధరిస్తేనేమీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటేనేమీ టూరిన్ నగరం సమీపంలో ఓ ఏటీఎంను ఇలాగే దోచుకొని పారిపోతుండగా అన్నదమ్ములు ఇద్దరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జైలుకు తరలించారు. వారిప్పుడు జైలు నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ఐడియా కోసం హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేసుకుంటున్నట్లున్నారు.