నన్ను అంబాసిడర్ చేయాలి: ఇవానా ట్రంప్
తనను చెక్ రిపబ్లిక్ కు యూఎస్ అంబాసిడర్ గా నియమించాలని న్యూయార్క్ పోస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్(67) అన్నారు. తనకు చెక్ మాట్లాడటం బాగా వచ్చని చెప్పుకొచ్చారు. చెక్ రిపబ్లిక్ తో పాటు ప్రపంచం మొత్తానికి తనను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను రాసిన మూడు పుస్తకాలు నలభై దేశాల్లో 25 భాషల్లో లభ్యమవుతున్నట్లు చెప్పారు.
ఇవానా పేరుతో తాను అందరికీ తెలుసని, తన పేరు చివర ట్రంప్ అనే పదం అవసరం లేదని అన్నారు. కాగా, తన కుటుంబ సభ్యులు ఇవాంక, ఎరిక్, డోనాల్డ్ జేఆర్, జారేద్ కుష్నేర్ లకు కార్యనిర్వహక కమిటీలో చోటు కల్పిస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 1947లో జన్మించిన ఇవానా ట్రంప్ ను చెక్ రిపబ్లిక్ కు యూఎస్ అంబాసిడర్ గా నియమిస్తే.. 2014 నుంచి ఆ స్ధానంలో కొనసాగుతున్న ఆండీ శ్చాపిరో ను తొలగించాల్సివుంటుంది. 1993 నుంచి చెక్ రిపబ్లిక్ కు అమెరికా అంబాసిడర్ ను పంపుతోంది.