ఉపాధి హామీకి పెద్దపీట
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెద్దపీట వేశారు.
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెద్దపీట వేశారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి అధికంగా నిధులు కేటాయించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఈ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ. 38,500 కోట్లు కేటాయించారు. ఈ డబ్బు మొత్తాన్ని ఖర్చుచేస్తే.. ఈ పథకం మీద ఇప్పటివరకు ఖర్చుపెట్టిన అత్యధిక మొత్తం ఇదే అవుతుందని గత బడ్జెట్ ప్రసంగం సమయంలో అరుణ్ జైట్లీ చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వెయ్యి కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెస్తామని జైట్లీ అన్నారు. 15వేల పంచాయతీలకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పన వస్తుందని అన్నారు. గత సంవత్సరం నిధులు పూర్తిగా వినియోగించారని మహిళల భాగస్వామ్యం కూడా 48 శాతం నుంచి 55 శాతానికి పెరిగిందని తెలిపారు.