రాష్ట్రపతి రేసులో ద్రౌపది ముర్ము
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి పదవి కోసం ఒడిశా రాష్ట్రానికి చెందిన దళిత వర్గం మహిళా నాయకురాలు, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము ఉత్సాహం కనబరుస్తున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది. తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి వర్గాల నుంచి రాష్ట్రపతి పదవిపట్ల ఔత్సాహికుల జాబితా బలం పుంజుకుంటోంది.
ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకునేందుకు జార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్న ద్రౌపది ముర్ము కృషి చేస్తున్నారు. ఆమె దళిత మహిళ కావడంతో అవకాశాలు మెండుగా ఉంటాయని భావిస్తున్నారు. 2015, మే 18 నుంచి ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. జార్ఖండ్‌లో తొలి మహిళా గవర్నర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బాధ్యతలను గతంలో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రశాసన సభకు వరుసగా 2 సార్లు ఆమె ఎన్నికయ్యారు. రాష్ట్రంలో బిజూ జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కూటమి సర్కారులో ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.