ముంబైలోని ఆ ఇల్లు మాదే: పాకిస్తాన్
న్యూఢిల్లీ: తమ దేశ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఇంటిని అప్పగించాలని పాకిస్తాన్ కోరింది. ముంబైలోని జిన్నా ఇంటిపై తమ ప్రభుత్వానికి ఉన్న యాజమాన్య హక్కును భారత సర్కారు గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఇంటిని భారత ప్రభుత్వం పరిరక్షిస్తుందన్న నమ్మకాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా వ్యక్తం చేశారు. ముంబైలో ఉన్న జిన్నా ఇల్లు తమదేశ ఆస్తి అని పేర్కొన్నారు. దీన్ని పాకిస్తాన్ కు అప్పగిస్తామని చాలా సందర్భాల్లో భారత్ హామీయిచ్చిందని, ఇప్పటివరకు మాట నిలబెట్టుకోలేదని వెల్లడించారు.
దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా ప్యాలెస్‌ను కూల్చివేసి, సాస్కృంతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ బిల్డర్ మంగల్ ప్రభాత్ లోధా ఈ నెల 25న అసెంబ్లీలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ భవనం ప్రభుత్వ ఆస్తి అని పేర్కొన్నారు. దీని నిర్వహణకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు.