రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు న్యాయం చేయాలి: అద్వానీ
రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు న్యాయం చేయాలి: అద్వానీ
Published Thu, Oct 3 2013 2:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
రాష్ట్ర విభజనను అంగీకరిస్తూనే సీమాంధ్రకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇంత అలజడితో రాష్ట్రాల విభజన జరిగిన తీరు ఎప్పుడూ చూడలేదు. ఎన్డీయే హయాంలో శాంతియుత వాతావరణంలో మూడు రాష్ట్రాలు ఇచ్చాం. అందుకు భిన్నంగా ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఉంది. ఆందోళనలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో సుమారు 145 దాకా కేంద్రప్రభుత్వ సంస్థలు ఉన్నాయంటున్నారు. వాటిలో సగం సీమాంధ్రకు తరలిస్తే ఎలా ఉంటుంది? యువకులు శాంతిస్తారా? కొత్తగా ఉద్యోగాలు వస్తాయా?’ అని వాకబు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఓట్ల రాజకీయంతో సమస్య తలెత్తిందని విమర్శించారు. సీమాంధ్రకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తెలంగాణ బిల్లుకు మద్దతు పలకవద్దని కోరుతూ బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతలు బుధవారం అద్వానీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కె.హరిబాబు, సోము వీర్రాజు, చంద్రశేఖర్‌రెడ్డి, వై.రఘునాథ్‌బాబు తదితరుల నాయకత్వంలో 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సుమారు 60 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు 6 పేజీల నోట్‌ను అద్వానీకి అందజేశారు.
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ, ప్రధాన కార్యదర్శులు రామ్‌లాల్, వి.సతీష్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిబాబు సీమాంధ్రలో పరిస్థితులను వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటున్నారంటూ గతంలో కేసీఆర్ ఈ ప్రాజెక్టును అడ్డుకున్న తీరును అద్వానీ దృష్టికి తీసుకువచ్చారు. పోలవరం పూర్తి కావాలంటే భద్రాచలం డివిజన్ సీమాంధ్రకే ఇవ్వాలని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, వాటి కాలువలు, నీటి పంపిణీ తదితర వ్యవహారాల పరిష్కారానికి స్వతంత్ర జల నిర్వహణ సంస్థ అవసరమని చెప్పారు. అగ్రనేతలతో భేటీ అనంతరం హరిబాబు మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూడటానికి అద్వానీ తదితరులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగడానికి ఇంకా రెండునెలల గడువు ఉందని, ఆ లోపు సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై పార్టీ అధినాయకత్వం ఒత్తిడి తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగిందని, సుమారు 145 ప్రభుత్వరంగ, పరిశోధన, వైద్య సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, వీటిలో కొన్నింటిని లేదా అనుబంధ సంస్థలను సీమాంధ్రలో ఏర్పాటు చేయాలని హరిబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్న దృష్ట్యా రెవెన్యూ పంపిణీపై విధానం ఏమిటో చెప్పాలన్నారు. నదీజలాల పంపిణీకి సంబంధించి యాజమాన్య పద్ధతులను స్పష్టంగా తెలియచేయాలని కోరారు. పార్టీ నేతలు శాంతారెడ్డి, వీర్రాజు, సురేష్‌రెడ్డి కూడా మాట్లాడారు. ఇలావుండగా బీజేపీ సీమాంధ్ర ప్రతినిధి బృందం గురువారం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌లతో భేటీ కానుంది. వీరికి షిండే అపాయింట్‌మెంట్ దొరికేలా అద్వానీ చొరవ తీసుకున్నారు.
అద్వానీ నివాసం ఎదుట ధర్నా
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం అద్వానీ నివాసం ఎదుట ధర్నా నిర్వహించారు. అద్వానీ నివాసానికి వస్తున్న అరుణ్ జైట్లీ వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రాష్ట్ర విభజనకు మద్దతు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సమైక్యవాదుల తల్లిదండ్రులు తమ పిల్లలతో రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి తమ సమస్యల్ని విన్నవించారు.
Advertisement
Advertisement