
విమానం అక్కడ ఎగరదా ...
గూడెపువలస (విజయనగరం జిల్లా) : ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చేది లేదని భోగాపురం మండలం రైతులు స్పష్టం చేశారు. తమ దగ్గరికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎయిర్ పోర్టుకు భూమి ఇస్తే రైతులుగా ఉన్న తాము కూలీలుగా మారిపోతున్నామని కె. బుజ్జి అనే మహిళ వాపోయింది. ఆమె ఇంకా ఏమందంటే....
'మాకు ఇక్కడ రెండు ఎకారాల భూమి ఉంది. మా ఇద్దరు పిల్లలు. వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇప్పుడు రైతుగా ఉన్నాం. మా భూమి ఇచ్చేస్తే ఏం చేయాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములే లాక్కుంటారా.... మీ పార్టీ నాయకుల భూములు మీకు కనబడటం లేదా... విమానాలు మా భూములమీదే ఎగురుతాయా, వేరే చోట విమానాలు ఎగరవా. గంజినీళ్లలో ఏముంటుంది. భూములు లాక్కోవడానికి చంద్రబాబు కంటే పెద్ద నాయకులే వెనుకంజ వేస్తున్నారు. మా భూములు లాక్కుంటే ఏమొస్తుంది?
అయ్యా చంద్రబాబూ... మీ ఆలోచనలతో చాలా మంది నష్టపోతున్నారు. మా భూములు లాక్కుని... మీరు వేసే ముష్టి మాకెందుకు. భూములు విషయంలో గత నెలరోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా... మా ప్రాంత వాసులు నిరాహార దీక్ష చేస్తుంటే పలకరించిన నాయకుడు ఒక్కడూ లేడు' అని బుజ్జి ఆవేదన వ్యక్తం చేశారు.