మిలటరీ ఆస్పత్రిలో ఉగ్రమూక.. భారీ పేలుళ్లు!
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది. కాబూల్‌లోని అతిపెద్ద మిలటరీ ఆస్పత్రి లక్ష్యంగా ఉగ్రవాదులు బుధవారం దాడికి తెగబడ్డారు. అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్న నాలుగువేల పడకల సర్దార్ మహమ్మద్ దౌద్ ఖాన్ ఆస్పత్రిలోకి ఐదుగురు సూసైడ్ బాంబర్స్ చొరబడ్డారు. అందులో ఒకడు ఆస్పత్రి గేటు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. అతడు డాక్టర్ దుస్తులు ధరించినట్టు తెలుస్తోంది. మిగతా నలుగురు సూసైడ్ బాంబర్ల ఆస్పత్రిలో చొరబడటంతో లోపల ఉన్న వైద్యులు, సిబ్బంది, రోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సూసైడ్ బాంబర్లను తుదముట్టించేందుకు ప్రస్తుతం భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి.
ఉగ్రవాదులు ఆస్పత్రిలోకి చొరబడ్డారని, ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అఫ్ఘాన్ రక్షణశాఖ తెలిపింది. 'దుండగులు ఆస్పత్రి లోపల ఉన్నారు. మా భద్రత కోసం ప్రార్థించండి' అంటూ ఆస్పత్రి సిబ్బంది ఒకరు ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. గతవారం కాబూల్‌లో జరిగిన తాలిబన్ జంట సూసైడ్ బాంబు పేలుళ్లలో 16మంది చనిపోయిన సంగతి తెలిసిందే.