
షాకింగ్ వీడియోను ట్వీట్ చేసిన కమల్
చెన్నై: జల్లికట్టు ఉద్యమం ఉధృతరూపం దాల్చి హింసాత్మకంగా మారిన నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ ఘటన తాలుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. జల్లికట్టు ఉద్రిక్తతల నేపథ్యంలో ఏకంగా ఓ పోలీసే ఆటోకు నిప్పు పెడుతున్న వీడియోను స్థానిక చానెళ్లు పదేపదే ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిన ఈ వీడియోను చూసి షాక్ తిన్న సినీ నటులు కమల్ హాసన్, అరవింద్ స్వామి తదితరులు ట్వీట్ చేశారు. ఏంటి ఇది? పోలీసులే ఇలా చేశారా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
గతకొన్నిరోజులుగా శాంతియుతంగా సాగిన జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారడంతో సోమవారం చెన్నై మహానగరం అట్టుడికిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల దాడులు, పోలీసుల లాఠీచార్జీలతో మెరీనా బీచ్ రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసే ఓ చోట స్వయంగా ఆటోకు నిప్పుపెట్టిన వీడియో సంచలనం రేపింది. అయితే, ఈ వీడియోపై పోలీసు అధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి అసాంఘిక చర్యలకు ఎవరూ పాల్పడినా చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి కే శంకర్ స్పష్టం చేయగా.. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని, దీనిపై విచారణ జరుపుతామని మరో పోలీసు అధికారి టీకే రాజేంద్రన్ చెప్పారు.