సహనటుడిని చితకబాదిన టాప్ కమెడియన్
దేశంలో టాప్ కమెడియన్‌గా పేరొందిన కపిల్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. మద్యం మత్తులో తన సహనటుడిపై ఆయన విమానంలోనే దాడి చేశాడు. లవ్ యూ జిన్నీ అంటూ కపిల్ తన ప్రియురాలిని ట్విట్టర్‌లో పరిచయం చేసిన 24 గంటలకే ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.
ఇటీవల మెల్‌బోర్న్, సిడీలలో స్టేజ్ షోలు నిర్వహించిన అనంతరం ఎయిరిండియా విమానం భారత్‌కు తిరిగొస్తుండగా సహ నటుడు సునిల్ గ్రోవర్‌పై కపిల్ చేయి చేసుకున్నట్టు తెలిసింది. ద కపిల్ శర్మ షోకు చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విమానంలో తన సీటులో సునీల్ గ్రోవర్ కూచుని ఉండగా.. కపిల్ ఆకస్మికంగా ఆయన వద్దకు వచ్చి తిట్లదండకాన్ని షురూ చేశాడు. సునీల్‌ను కాలర్ పట్టుకొని లేపి.. అతన్ని కొట్టాడు. కపిల్ కొడుతున్నా.. తిడుతున్నా సునీల్ మౌనంగా భరిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో కపిల్ తాగి ఉన్నాడని, 'నువ్వు నా నౌకర్‌వి' అంటూ సునీల్‌ని అడ్డగోలుగా తిడుతూ దాడి చేశాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
దీంతో ఇతర బృంద సభ్యులు అక్కడికి వచ్చి.. అతన్ని పక్కకు తీసుకుపోయారని సమాచారం. ఈ ఘటనపై ఎయిరిండియా ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ద కపిల్ శర్మ షోలో సునీల్ గ్రోవర్ డాక్టర్ మషూర్ గులాటీగా కామెడీ పండిస్తున్నాడు. అతను గతంలో కపిల్ తనకు తగినంత వేతనం ఇవ్వడం లేదంటూ.. స్టార్ ప్లస్ చానెల్‌లో సొంతంగా కామెడీ షో నిర్వహించాడు. అది క్లిక్ కాకపోవడంతో మళ్లీ కపిల్ షోలో పాల్గొంటున్నాడు. తాజా దాడి నేపథ్యంలో ఈ ఇద్దరూ ట్విట్టర్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.