ఐఏఎస్ డెత్ మిస్టరీ; కీలక మలుపు
- భార్య దూరమైన వేదనలో అనురాగ్!
- సమగ్ర దర్యాప్తు కోరుతూ యూపీ సీఎంకు కర్ణాటక సీఎం లేఖ
- అనుమానాలు వ్యక్తంచేస్తూ బీజేపీ ఎంపీ శోభ లేఖాస్త్రం
- అధికారి మృతిపై కాంగ్రెస్-బీజేపీ పొలిటికల్ వార్
బెంగళూరు/లక్నో: ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ అనుమానాస్పద మృతి కేసు మరో మలుపు తీసుకుంది. కాంగ్రెస్ కుంభకోణాల గుట్టును పసిగట్టినందుకే ఆయనున చంపేసి ఉంటారని బీజేపీ ఆరోపించింది. మొన్న యూపీ మంత్రి సురేశ్ ఖన్నా, నేడు ఉడిపి-చిక్‌మంగళూరు బీజేపీ ఎంపీ శోభ కరంద్లాజే ఈ మేరకు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి దిత్యానాథ్‌కు లేఖరాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనురాగ్ తివారీ.. కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తు.. బుధవారం లక్నోలోని గెస్ట్‌హౌస్‌లో అనుమానాస్పదరీతిలో మరణించిన సంగతి తెలిసిందే. అనురాగ్ మృతి కేసును సమగ్రంగా దర్యాప్తుచేసి, నిజానిజాలు వెలికితీయాలని సిద్దూ లేఖలో కోరారు. అనురాగ్ మృతితోపాటు విపక్ష బీజేపీ చేస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది.
శోభ సంచలన ఆరోపణలు
కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖలో కమిషనర్‌గా పనిచేస్తోన్న అనురాగ్ తివారీ.. ఇటీవలే ఓ భారీ కుంభకోణాన్ని పసిగట్టారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులకు ఆ కుభకోణంతో సంబంధాలున్నాయని, అందుకే ఆయనను హత్యచేసి ఉంటారని ఉడిపి-చిక్‌మంగళూరు ఎంపీ శోభ కరంద్లాజే ఆరోపించారు. ఈ మేరకు ఆమె.. యూపీ సీఎం యోగికి ఒక లేఖ రాశారు. ‘ఫుడ్ మాఫియానే ఆ అధికారి(అనురాగ్)ని బలితీసుకుందని కర్ణాటకలోని అధికారులు చర్చించుకోవడం నాకు తెలిసింది’ అని శోభా బాంబు పేల్చారు. అటు యూపీ మంత్రి సురేశ్ కుమార్ ఖన్నాకూడా ఇదే తరహా అనుమానాలను వెలిబుచ్చారు.
భార్యతో విడిపోయిన బాధ..!
రాకీయపార్టీల ఆరోపణల సంగతి పక్కనపెడితే, అనురాగ్ తివారీ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు మాత్రం గుండెపోటు వల్లే మరణం సంభవించి ఉంటుందనే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బెంగళూరు నుంచి శిక్షణా తరగతుల కోసం ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీకి వెళ్లిన అనురాగ్ తివారీ.. అనంతరం స్వస్థలం లక్నోకు వెళ్లారు. లక్నోలోని అసెంబ్లీ భవనానికి కూతవేటు దూరంలో.. వీఐపీ ఏరియాలోని గెస్ట్ హౌస్ గేటు వద్ద ఆయన కుప్పకూలిపోయరు. ఆస్పత్రికి తరలించేసరికే అనురాగ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, కొద్ది నెలల కిందటే తివారీ తన భార్యతో విడిపోయరని, అప్పటి నుంచి ఆయన బాధలో ఉండిపోయారని సన్నిహితులు పేర్కొన్నారు. మనోవేదనే గుండెపోటుకు కారణం అయిఉండొచ్చని వారు పేర్కొన్నారు.
(ఐఏఎస్ అధికారి అనుమానాస్పద మృతి)