సీఎం ఆర్డర్‌ ఆమెను పిలవండి | IAS Roshan Jacob Appointed District Magistrate In Charge Of Lucknow | Sakshi
Sakshi News home page

సీఎం ఆర్డర్‌ ఆమెను పిలవండి

Published Mon, Apr 19 2021 12:25 AM | Last Updated on Mon, Apr 19 2021 12:36 AM

IAS Roshan Jacob Appointed District Magistrate In Charge Of Lucknow - Sakshi

రోషన్‌ జాకబ్, ఐ.ఎ.ఎస్‌. (తాజా బాధ్యతల్లో)

కరోనాను కంట్రోల్‌లో పెట్టేందుకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ దగ్గర ఉన్న ‘టీమ్‌ 11’ అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది! యూపీ బ్యూరోక్రసి మొత్తం కరోనాతో మంచం పట్టేసింది. ఆ టీమ్‌లోని సభ్యులైన అడిషనల్‌ చీఫ్‌ సెక్రెటరీకి శనివారం కోవిడ్‌ ఎటాక్‌ అయింది. డీజీపీకి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. లక్నో డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ (డి.ఎం.) హుటాహుటిన క్వారెంటైన్‌కు వెళ్లిపోయారు. యోగికి ఏం పాలుపోలేదు. లక్నోలో రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. కాసేపు తలపట్టుకుని, డాక్టర్‌ రోషన్‌ జాకబ్‌ ఎక్కడ? అని అడిగారు యోగి. ఆమె డాక్టర్‌ కారు. ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌. తక్షణం ఆమెను పిలిపించారు. లక్నో డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌గా నియమించారు! కరోనా ఇక తన గొయ్యి తాను తవ్వుకున్నట్లే! ఎందుకంటే.. స్కెచ్‌ వేసి, స్పాట్‌ పెట్టి ఎంతటి సమస్యనైనా ఫినిష్‌ చేసేస్తారని రోషన్‌ జాకబ్‌కు పేరు!

ఇవాళ్టి నుంచీ రోషన్‌ జాకబ్‌ లక్నో జిల్లా మేజిస్ట్రేట్‌. అయితే శనివారమే ఆమె ఆ పనిలోకి దిగిపోయారు. కరోనాను కట్టడి చేసే పని. ఆ సీట్లో ఉన్న అభిషేక్‌ ప్రకాశ్‌కి కరోనా రావడంతో, అత్యవసరంగా ఆమెను నియమిస్తూ గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆమెకే ఎందుకు? అక్కడికే వస్తున్నాం. ఇప్పటికే ఆమె రెండు పదవుల్ని నిర్వహిస్తున్నారు. ఇది మూడోది! ప్రస్తుతం యూపీ జియాలజీ అండ్‌ మైనింగ్‌కి ఆమె స్పెషల్‌ సెక్రెటరీ, డైరెక్టర్‌. ఇప్పుడిక లక్నో డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ కూడా. ఏప్రిల్‌ 15న లక్నో సిటీలో నమోదైన కరోనా కేసులు 35,865. రాష్ట్రంలో మిగతాచోట్లకంటే ఎక్కువ. ‘టీమ్‌ 11’ ఆపలేకపోయింది. ఆపలేకపోగా తనే కరోనా బారిన పడింది. 16వ తేదీ కూడా కేసులేం తగ్గలేదు. 17న రోషన్‌ జాకప్‌కి పిలుపు. ‘టేక్‌ ద చార్జ్‌ ఇమ్మీడియట్‌లీ’.
















గోండా జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు రోషన్‌ జాకబ్‌ 
ఎలాంటి చార్జ్‌నైనా రోషన్‌ సవాలుగా తీసుకుంటారు. ఆమె దగ్గరో ఒక ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారం సమస్యను చుట్టుముట్టి, మట్టుపెడతారు. పరిస్థితి చక్కబడుతుంది. యూపీలోని గోండా జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆమె ఏం చేశారో చూడండి. జిల్లా అభివృద్ధిలో మహిళల ఉపాధి పథకాలను భాగం చేశారు. ‘ఉమెన్‌ ఎంప వర్‌మెంట్‌’ కోసం ప్రత్యేకంగా ఆమె ఏమీ పని చేయలేదు. మహిళల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడేలా చేశారు. స్త్రీ సాధికారత ప్రభావం స్త్రీల వరకే ఉంటుందా! పిల్లలు శుభ్రంగా చదువుకుంటారు. పెద్దలు బాధ్యత నేర్చుకుంటారు. ఇల్లు, ఊరు, సమాజం మెరుగవుతాయి. గోండా అలాగే క్లీన్‌ అయింది. కాన్పూర్‌ డి.ఎం.గా కూడా చేశారు రోషన్‌.

అక్కడైతే ‘మై సిటీ’అని భారీ ప్రాజెక్టునే ప్రారంభించారు. ఆరేళ్లనాటి సంగతి ఇది. సోషల్‌ మీడియాను మంచికి ఉపయోగించడం, పరిశుభ్రత, చెత్త పారేయడం, విద్యు™Œ  వినియోగం, నీటి సరఫరా, మురుగు నీరు సాఫీగా ప్రవహించేలా చేయడం.. ఈ ఆరు అంశాల్లో నగర ప్రజల్ని భాగస్వాముల్ని చేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే ఆ ఆధికారుల దృష్టికి సమస్య వెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ సమస్య పరిష్కారం అయిందీ లేనిదీ తెలిపే వ్యవస్థను కూడా. రోషన్‌ వచ్చాక సిటీ మొత్తం మారిపోయింది. ప్రజల్ని కలుపుకుని పోతే ‘పదండి చేద్దాం’ అని ముందుకు కదులుతారు. ప్రజల్ని ఆదేశిస్తే ‘అది మీ పని కదా’ అని వెనక్కి అడుగేస్తారు. రోషన్‌ సక్సెస్‌ మంత్రం అదే.
∙∙
రోషన్‌ జాకబ్‌ 2004 బ్యాచ్‌ ఐ.ఎ.ఎస్‌. అధికారి. యూపీకి తొలి మహిళా మైనింగ్‌ డైరెక్టర్‌. గత ఏడాది లాక్‌డౌన్‌లో కూడా ఆమె మైనింగ్‌ వర్క్‌ని నడిపించారు! దేశంలో ఇంకే రాష్ట్రంలోని మైనింగ్‌ డైరెక్టర్‌ కూడా ఇంత చొరవ చూపించలేదు. ఆమెను చూశాకే మిగతా రాష్ట్రాలు మైనింగ్‌ పనులను పునఃప్రారంభించాయి. ‘‘కార్మికుల ఉపాధికి విరామం వస్తే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది’’ అంటారు రోషన్‌. మరి కరోనా వస్తే! రాకుండా అన్నీ జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆనాడు ఆమె పని తీరు ఫలితాలను కళ్లారా చూసింది కనుకనే యోగి ప్రభుత్వం ఇప్పుడామెకు లక్నో డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ బాధ్యతలు కూడా అప్పగించింది. 43 ఏళ్ల రోషన్‌ జాకబ్‌ కేరళ అమ్మాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement