యువ ఐఏఎస్ మృతి.. అసలేం జరిగింది?
⇒ యువ ఐఏఎస్ మృతిపై లోతైన విచారణ
⇒ రాష్ట్రానికి రానున్న యూపీ పోలీసులు
⇒ సీఎస్, ఇతర ముఖ్య అధికారులతో భేటీ
⇒ ఆహార పౌరసరఫరాల శాఖ నుంచి సమాచార సేకరణ
సాక్షి, బెంగళూరు: నాలుగు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అనుమానాస్పద రీతిలో మరణించిన కర్ణాటక కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారి మరణంపై యూపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ప్రారంభించింది. ఈ బృందం విచారణ కోసం కర్ణాటకకు రానుంది. మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్ర కుంటియాతో భేటీ కానుంది.
ఆయన నుంచి సమాచారాన్ని సేకరించిన అనంతరం ఆహారపౌర సరఫరాల శాఖ సిబ్బందిని కూడా విచారించి సమాచారాన్ని సేకరించనున్నారు. 2007 బ్యాచ్ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్‌తివారి ఈ నెల 17న లక్నో రోడ్డుపై అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది సహజ మరణం కాదని ఎవరో హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వారంతా పేర్లు బయటకు చెప్పకుండా కర్ణాటకకు చెందిన కొంతమంది అధికారులు, మంత్రుల పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర మంత్రులపై తివారి సోదరుని ఆరోపణలు
తివారి తమ్ముడైన మయాంక్ తివారి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ‘మా అన్న కర్ణాటకలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసే సమయంలో దాదాపు 2వేల కోట్ల రూపాయాల కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. వాటిని ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీబీఐకి కూడా పంపించాలని భావించారు. దీంతో ఆయనపై సీనియర్ అధికారుల ద్వారా మంత్రులు ఒత్తిళ్లు తీసుకువచ్చారు. తివారి ఈ విషయాలన్నీ నాకు చెప్పడమే కాకుండా ఆ వివరాలు వాట్సప్‌లో నాకు పంపించారు.’ అని బహిరంగంగా ప్రకటించారు.
ఆధారాలను సైతం అక్కడి అధికారులకు అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బందం ఇక్కడికి రానుంది. అనురాగ్ తివారి కర్ణాటకలో ఆహార శాఖ కమిషనర్‌గా పనిచేసే సమయంలో ఆయన పనితీరు, సిబ్బందితో వ్యవహరించిన తీరు, సీనియర్ అధికారుల ప్రవర్తన తదితర విషయాల పై సమాచారం సేకరించనున్నట్లు సమాచారం.
మానసిక కుంగుబాటు కారణమా?
తివారి అనుమానాస్పద మృతి పట్ల సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇందుకు పూర్తి సహకారం అందించనున్నట్లు సీఎం సిద్ధరామయ్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖ రాయడం తెలిసిందే. ఇక బీజేపీ రాష్ట్రశాఖ కూడా ఈ విషయం పై సమగ్ర దర్యాప్తునకు పట్టుబడుతోంది. ఇదిలా ఉండగా కుటుంబ కలహాల వల్ల తివారి కొంత కాలంగా మానసికంగా కలత చెందినట్లు వాదన కూడా వినిపిస్తోంది. భార్యతో విడాకులు తీసుకున్నారని, దీనివల్ల తీవ్రంగా కుంగిపోయారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.