
సాక్షి, బెంగళూరు : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య రెట్టింపు సంతోషంతో తన స్వరాన్ని పెంచారు. ట్విటర్ వేదికగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శల వర్షం కురిపించారు. 'ముందు ఉపన్యాసాలు తగ్గించుకోండి' అంటూ హితబోధ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం నిర్వహించే బీజేపీ ప్రముఖుల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. 'ఒక సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ తీవ్ర అవమాన భారంతో బాధపడుతోంది. చరిత్రాత్మక విజయం సాధించిన సమాజ్‌వాది పార్టీ బీఎస్పీలకు నా అభినందనలు. బీజేపీయేతర పార్టీల ఐక్యత చాలా కీలక పాత్ర పోషించింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అదే సమయంలో సీఎం ఆదిత్యనాథ్ కర్ణాటక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇవ్వడం తగ్గించుకుంటే ఆయనకే మంచిదంటూ చురకలంటించారు. ముందు ఆయన ఉండే చోటులో అభివృద్ధిని పట్టించుకోవాలన్నారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకపై దృష్టిని సారించింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో విజయం అనంతరం ఇక తమ దృష్టి కర్ణాటకపై అని చెప్పింది. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలు, పైగా దాదాపు 30 ఏళ్లుగా బీజేపీ ఆదిపత్యం కొనసాగిన చోట ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.