కాశ్మీర్ వరదలు కలిపాయి!
సాధారణంగా వరదలు మనుషుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయి. కాని జలప్రళయం ఓ చిన్నారిని తనవారికి చేరువ చేసింది. కాశ్మీర్ వరదలు ఓ చిన్నారికి చెర నుంచి విముక్తి కల్పించాయి. ఓ మంచి వ్యక్తి సాయంతో సదరు బాలిక సొంతగూటికి చేరుకోగలిగింది.
మేఘ అనే ఆరేళ్ల బాలిక ముంబైలోని బాంద్రా ప్రాంతం నుంచి ఏడాది క్రితం కిడ్నాపయింది. మేఘను ఎత్తుకుపోయిన దుండగుడు ఆమెను జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ తీసుకుపోయాడు. అక్కడ ఆమెతో బలవంతంగా భిక్షాటన చేయించాడు. సెప్టెంబర్ లో శ్రీనగర్ లో వరదలు సంభవించినప్పుడు చాలా మంది గల్లంతయ్యారు. వరదల్లో గల్లంతైన బాలిక అనుకుని మేఘను దాల్ గేట్ ప్రాంత వాసులు చేరదీశారు. ఇమామ్ ఆషిక్ ఇలాహి అనే వ్యక్తి ఆమె బాధ్యత తీసుకున్నాడు. మేఘను జహాన్ ఆరా అనే మహిళ ఇంట్లో ఉంచి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమె ఫోటోలు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశాడు.
ఈ ప్రయత్నాలు ఫలించడంతో రెండు వారాల తర్వాత మేఘ తనవారిని చేరుకుంది. మేఘ గురించి తెలుసుకున్న ఆమె తాతయ్య రమేష్ మదన్ ఠాకూర్.. శ్రీనగర్ కు వచ్చారు. వివరాలు అన్ని నిర్ధారించుకున్న తర్వాత మేఘను ఆమె తాతయ్యకు పోలీసులు అప్పగించారు. నజీర్ అహ్మద్ అనే వ్యక్తి తనను ఎత్తుకొచ్చాడని మేఘ తెలిపింది. ముందుగా యూపీ, కోల్కతా తీసుకెళ్లాడని తర్వాత శ్రీనగర్ తీసుకొచ్చాడని వెల్లడించింది. భిక్షాటన చేయాలని ఒత్తిడి చేసేవాడని తెలిపింది.
కాగా, మేఘ గురించి ఎవరూ రాకపోతే తమదగ్గరే ఉంచుకోవాలనుకున్నామని జహాన్ ఆరా తెలిపింది. తన నలుగురు పిల్లలతో ఆమె కలిసిపోయిందని వెల్లడించింది. మళ్లీ తనవారిని కలుసుకోవడంతో చిన్నారి మేఘ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.