టైటిల్: టెనెంట్
నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు
దర్శకత్వం: వై. యుగంధర్
నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి
నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్ బ్యానర్
సినిమాటోగ్రఫీ: జెమిన్ జోం అయ్యనీత్
ఎడిటర్: విజయ్ ముక్తవరపు
సంగీతం: సాహిత్య సాగర్
విడుదల తేదీ: 19-04-2024
అసలు కథేంటంటే..
సత్యం రాజేశ్(గౌతమ్), మేఘా చౌదరి(సంధ్య) పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు. అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉంటుందో వారి మధ్య ప్రేమానురాగాలు అలా ఉంటాయి. ఓ ఖరీదైన ఫ్లాట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. త్వరలోనే అమెరికా వెళ్లాలనుకున్న ఆ దంపతుల మధ్య బంధం, ప్రేమ ఒక్కసారిగా దూరమవుతుంది. కానీ అన్నింటిని మౌనంగానే భరిస్తూ వస్తాడు గౌతమ్. సంధ్య ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఆమె ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె బెడ్‌పైనే విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారి అపార్ట్‌మెంట్‌లోనే ఓ యువకుడు పైనుంచి కిందకు దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా?. గౌతమే ఆమెను చంపేశాడా? లేదా ఆమె మరణం వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అసలు అపార్ట్‌మెంట్ నుంచి కిందకు దూకిన యువకుడు ఎవరు? అసలు పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? అనే విషయాలు తెలియాలంటే టెనెంట్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ తర్వాత డైరెక్టర్ వై యుగంధర్ తెరకెక్కించిన చిత్రమిది. సమాజంలో నిజజీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే టెనెంట్. టెనెంట్.. ఈ టైటిల్ చూడగానే చాలామందికి గుర్తొచ్చేది అద్దెకు ఉంటున్న వాళ్లు అని. టైటిల్‌తోనే మీకు కథ ఏంటనేది ఓ ఐడియా వచ్చేస్తుంది. ఆ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను తీశారు. క్లైమాక్స్ సీన్‌తో కథను ప్రారంభించిన యుగంధర్.. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్‌లో గౌతమ్, సంధ్యకు పెళ్లి కావడం, వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో కథను నడిపించారు. వారి ఫ్లాట్ పక్కన ఉండే టెనెంట్స్‌తో సన్నివేశాలు కాస్తా నవ్వులు తెప్పించినా.. సీరియస్‌నెస్ ఎక్కడా మిస్సవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు.. మరోవైపు భార్య, భర్తల మధ్య వచ్చే సీన్లతో మెల్లగా ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లాడు. కానీ పెద్దగా సస్పెన్ష్, ట్విస్టుల్లాంటి లేకపోవడంతో కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది.
సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. పక్క ఫ్లాట్‌లో ఉండేవారితో గౌతమ్ భార్య సంధ్యకు పరిచయం కావడం, వారితో కలిసిపోవడం చకాచకా జరిగిపోతుంది. గౌతమ్, సంధ్యకు ఫ్లాట్ పక్కన ఉండే రిషి(భరత్ కాంత్) తనకు కాబోయే అమ్మాయి శ్రావణిని(చందన) పరిచయం చేస్తాడు. అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది. రిషి ఫ్రెండ్స్ అతని ఫ్లాట్‌కు రావడం.. గౌతమ్‌ను రిషి సాయం కోరడం.. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతాయి. అదే సమయంలో రిషి ఫ్రెండ్స్ చేసిన పనికి అతని జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అతని ఫ్రెండ్స్ చేసిన పనేంటి? చివరికీ రిషికి గౌతమ్ సాయం చేశాడా? ఆ తర్వాత రిషి, శ్రావణి ఏమయ్యారు? సంధ్య ఎలా మరణించింది? పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ చివరికీ నిజం చెప్పాడా? అనే సస్పెన్ష్‌తో ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా చేశారు. క్లైమాక్స్ సీన్ వరకు సంధ్య ఎలా చనిపోయిందన్న విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్ష్ కొనసాగించాడు డైరెక్టర్. చివర్లో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ మంచి సందేశం ఇస్తూ ముగింపు పలికాడు.
ఎవరెలా చేశారంటే..
పొలిమేర-2 తర్వాత సత్యం రాజేశ్ నటించిన చిత్రం టెనెంట్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. సత్యం రాజేశ్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. ఇలాంటి మిస్టరీ కథల్లో హావాభావాలతో మెప్పించడంలో సత్యం రాజేశ్ ఒదిగిపోయారు. హీరోయిన్‌గా మేఘా చౌదరి ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి మూవీ తర్వాత నటించిన చిత్రమిది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ఇన్‌స్పెక్టర్ ఎస్తేర్ నోరోన్హా ఈ సినిమాలో హైలెట్. తన గ్లామర్‌తో పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించింది. చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే సాహిత్య సాగర్ నేపథ్యం సంగీతం, బీజీఎం బాగుంది. జెమిన్ జోం అయ్యనీత్ సినిమాటోగ్రఫీ, విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment