టైటిల్: ‘సారంగదరియా’
నటీనటులు: రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్ తదిరతులు
నిర్మాణ సంస్థ: సాయిజా క్రియేషన్స్
నిర్మాతలు: ఉమాదేవి, శరత్ చంద్ర, చల్లపల్లి
దర్శకత్వం: పద్మారావు అబ్బిశెట్టి(పండు)
సంగీతం: ఎం. ఎబెనెజర్ పాల్
సిసిమాటోగ్రఫీ: సిద్ధార్థ స్వయంభు
విడుదల తేది: జూలై 11, 2024
కథ
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కృష్ణ కుమార్(రాజా రవీంద్ర) ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. పెద్ద కొడుకు అర్జున్(మెయిన్ మొహమద్) తాగుడుకు బానిసవుతాడు. రోజూ మద్యం తాగుతూ బార్‌లో గొడవపడుతుంటాడు. చిన్నోడు సాయి (మోహిత్) అమ్మాయిల చుట్టూ తిరుగుతూ.. చివరకు తమ ఏరియాలోనే ఉండే కాలేజీ అమ్మాయి ఫాతిమా(మధులత)ను ప్రేమలోకి దింపి, రొమాంటిక్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. కూతురు అనుపమ(యశస్విని) మాత్రం బుద్ధిగా చదువుకుంటూ.. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటుంది.
అనుపమ అంటే అదే కాలేజీలో చదువుతున్న రాజ్(శివచందు)కి చాలా ఇష్టం. తన ప్రేమను అంగీకరించాలంటూ ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అనుపమ మాత్రం అతన్ని దూరం పెడుతుంది. మిస్ బ్యూటీ క్వీన్ కావాలనేది ఆమె లక్ష్యం. అయితే ఓ రోజు కృష్ణకుమార్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా.. రాజ్ తండ్రి(కదంబరి కిరణ్)వచ్చి గొడవ చేస్తాడు. దీంతో అనుపమకు సంబంధించిన ఓ పెద్ద రహస్యం బయట పడుతుంది.
అదేంటి? కృష్ణకుమార్ సొంత ఊరిని వదిలి వచ్చి వేరే చోట బతకడానికి గల కారణం ఏంటి? రెస్టారెంట్ పెట్టి మంచి బిజినెస్ చేసే అర్జున్.. తాగుడుకు ఎందుకు బానిసగా మారాడు? ఫాతిమాతో ప్రేమాయణం.. సాయి జీవితాన్ని ఎలా మార్చేసింది? మిస్ బ్యూటీ క్వీన్ పోటీల్లో పాల్గొనే క్రమంలో అనుపమకు ఎదురైన సమస్యలు ఏంటి? తనకు తండ్రి కృష్ణ కుమార్ ఎలా సపోర్ట్‌గా నిలిచాడు? కృష్ణకుమార్ ఫ్యామిలీకి సమాజం నుంచి ఎదురైన సమస్యలేంటి? వాటిని అధిగమించి తన పిల్లలను ఎలా ప్రయోజకులుగా మార్చుకున్నాడు? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే?
ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. ట్రాన్స్ ఉమెన్స్‌ని సమాజం ఎలా చూస్తుంది? సొంతవాళ్ల నుంచే వాళ్లకు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి? అనేది చూపిస్తూనే.. వారిని ఎంకరేజ్ చేస్తే ఎలా రాణించగలరో ఇందులో చూపించారు.
ఓ వైపు భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పండు. ఒకే సినిమా ద్వారా నాలుగైదు సందేశాత్మక కథలను చెప్పాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను డీల్ చేయడం మాములు విషయం కాదు. తొలి సినిమాతోనే మంచి సందేశం అందించిన డైరెక్టర్‌ని అభినందించాల్సిందే. కానీ ఇలాంటి సందేశాత్మక సినిమాలను ఎంకరేజ్ చేసేందుకు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. అటు సరదాగా, ఇటు కమర్షియల్‌గా చెబితేనే సినిమా చూస్తామంటున్నారు. దర్శకుడు పద్మారావు ఆ కోణంలో సినిమా తీయాలని ప్రయత్నించాడు కానీ పూర్తిగా సఫలం కాలేకపోయాడు.
విశ్లేషణ
కృష్ణకుమార్ కుటుంబ సభ్యులందరి గురించి వివరంగా చెప్పడంతో మూవీ కొంత సాగదీసినట్లు అనిపిస్తుంది. అర్జున్ పాత్ర ఎమోషనల్‌గా ఉంటే సాయి పాత్ర టీనేజ్ కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యేలా చిల్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. రెండో భాగంలో ఏమైనా మెరుపులు ఉంటాయా? అంటే అక్కడ తడబాటే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సీన్‌ను డీటెయిల్‌గా చెప్పేందుకు ప్రయత్నించడంతో బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. వరుసగా కష్టాలు ఎదురవడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి ఓరకమైన నిస్సహాయత అలుముకున్న భావన రాక మానదు. అను పాత్ర యాక్టివ్‌గా ఉంటుంది.
'ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం. కానీ, జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది' అన్న డైలాగ్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో అను తండ్రి గురించి చెప్పే డైలాగ్స్‌కు విజిల్ వేయాల్సిందే! తన స్పీచ్.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్ష గురించి చర్చించేలా చేస్తుంది. ఎక్కువ సాగదీత వల్లే సినిమాలో ఎమోషన్ ఆశించినంత పండలేదు.
నటీనటులు
కృష్ణ కుమార్‌గా రాజా రవీంద్ర బాగా యాక్ట్ చేశాడు. ఎప్పుడూ పాజిటివ్, నెగెటివ్ రోల్స్ చేసే ఆయనకు తొలిసారి పూర్తి స్థాయి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నాడు. ప్లేబాయ్ తరహా పాత్రలో సాయి మెప్పించాడు. అనుగా యశస్వి ఆకట్టుకుంది. అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ లీనమైపోయి నటించాడు. మిగతా పాత్రలు పర్వాలేదనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment