టైటిల్: కల్కి 2898 ఏడీ
నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నాబెన్ తదితరులు
నిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్
నిర్మాత: అశ్వనీదత్
దర్శకత్వం: నాగ్ అశ్విన్
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: జూన్ 27, 2024
ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కల్కి ‘2898 ఏడీ’ ఒకటి. ప్రభాస్ హీరోగా నటించడం.. కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘కల్కి 2898 ఏడీ’ కథేంటంటే..
కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్స్(డబ్బులు) ఉండాలి. ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్ భైరవ(ప్రభాస్) కూడా ఒకడు. ఎప్పటికైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లి సుఖపడాలనేది అతడి కోరిక. యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. అతనికి బుజ్జి((ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్)తోడుగా ఉంటుంది.
మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్‌ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.
వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘కల్కి 2898’తో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు.
పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్, శంబాల ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి.
అయితే కథ పరంగా చూస్తే మాత్రం ఇందులో పెద్దగా ఏమీ ఉండడు. అసలు కథంతా పార్ట్ 2లో ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. వాస్తవానికి నాగ్ అశ్విన్ రాసుకున్న కథ చాలా పెద్దది. అనేక పాత్రలు ఉంటాయి. ఒక్క పార్ట్‌లో ఇది పూర్తి చేయడం సాధ్యం కాని పని. అది నాగికి కూడా తెలుసు. అందుకే పార్ట్ 1ని ఎక్కువగా పాత్రల పరిచయాలకే ఉపయోగించాడు.
కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఆరువేల సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళ్తుంది. కాశీ, కాంప్లెక్స్, శంబాల ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీనం అవుతాడు. భారీ యాక్షన్ సీన్‌తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. బుజ్జి, భైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్‌టైనింగ్ అనిపిస్తుంది. ఇంటెర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
ద్వితీయార్థంలో కథనంలో వేగం పుంజుకుంటుంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో అమితాబ్ పాత్రతో మహాభారతం కథను చెప్పించడం.. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ 2పై మరింత ఆసక్తిని పెంచుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ కూడా తెరపై తక్కువ సమయమే కనిపిస్తాడు. భైరవగా ఆయన చేసే యాక్షన్, కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మరో పాత్ర కూడా పోషించాడు అదేంటనేది వెండితెరపైనే చూడాలి. ప్రభాస్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అమితాబ్‌ది. అశ్వత్థామ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ప్రభాస్-అమితాబ్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. సుప్రీం యాష్కిన్‌గా కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. అయితే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే. పార్ట్ 2లో ఆయన రోల్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీ సుమతిగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. శంబాల ప్రంచానికి చెందిన రెబల్ ఖైరాగా అన్నాబెన్, రూమిగా రాజేంద్ర ప్రసాద్, వీరణ్‌గా పశుపతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ చాలా బాగుంది. నాగ్ అశ్విన్ ఊహా ప్రపంచానికి టెక్నికల్ టీమ్ ప్రాణం పోసింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు అయితే తెరపై మరీ దారుణంగా అనిపించాయి. నేపథ్య సంగీతం కూడా యావరేజ్‌గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment