భర్తలను వదిలేస్తున్నారు!
శ్రీనగర్: చెడు వ్యసనాలకు బానిసలైన భర్తలను వదులుకునేందుకు కశ్మీర్ మహిళలు సందేహించడం లేదు. మత్తుపదార్థాలకు బానిసలైన భర్తలతో తెగతెంపులు చేసుకుంటున్న మహిళల సంఖ్య కశ్మీర్ లో పెరుగుతోంది. సామాజిక కట్టుబాట్లను అధిగమించి భర్తలకు విడాకులు ఇచ్చేస్తున్నారు.
మాదకద్రవ్యాలకు అలవాటుపడి తనను చిత్రహింసలకు గురిస్తున్న భర్తకు 27 ఏళ్ల రిఫాత్ విడాకులు ఇచ్చేసింది. స్థానిక షరియా కోర్టు సాయంతో ఇటీవల భర్తలకు విడాకులు ఇచ్చేసిన 40 మందిలో ఆమె ఒకరు. భర్త నుంచి విడిపోయేందుకు తన తల్లిదండ్రులను ఒప్పించడానికి ఆమె కష్టపడింది. 'మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వరాదని పురుషులు ఎందుకు భావిస్తారో నాకు అర్థం కాదు. పురుషుడికి మాత్రమే విడాకులు ఇచ్చే హక్కు ఉందని వారు అనుకుంటారు' అని రిఫాత్ పేర్కొంది.
భర్తకు విడాకులు ఇచ్చిన ఉత్తర కశ్మీర్ కు చెందిన షజియా సమాజం నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కొంది. అయితే తాను సరైన నిర్ణయం తీసుకున్నానని, ఎవరేమన్నా పట్టించుకోబోనని షజియా స్పష్టం చేసింది. డ్రగ్స్ కు అలవాటు పడిన భర్తలు పెట్టే చిత్రహింసలు భరించలేక బాధిత మహిళలు విడాకులు కోరుతున్నారని కశ్మీర్ గ్రాండ్ ముప్తీ నసీరుల్ ఇస్లాం తెలిపారు. గత నెల రోజుల కాలంలో షరియా కోర్టు 40 విడాకులు కేసులను మెడికల్ బోర్డుకు పంపిన తర్వాత నిర్ణయం తీసుకుంది. మత్తు పదార్థాలకు బానిసలైన భర్తలతో తెగతెంపులు చేసుకునే మహిళల సంఖ్య పెరుగుతుండడంతో ఈ అంశం పతాక శీర్షికలకు ఎక్కింది.