ఎనిమిదేళ్ల బంధానికి తెగదెంపులు
కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్తున్న కవసాకి, బజాజ్ ల బంధాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి ఆపివేయాలని కీలకనిర్ణయం తీసుకున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఏప్రిల్ 1 అనంతరం నుంచి కవసాకి మోటార్ సైకిళ్లు విక్రయాలు, సేల్స్ సర్వీసు కూడా ఇండియా కవసాకి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే అందిస్తారని తెలిసింది. కవసాకి హెవీ ఇండస్ట్రీస్ జపాన్కు ఇది సబ్సిడరీ. 2009లో విక్రయాలు, విక్రయనాంతరం సర్వీసుల కోసం బజాజ్ ఆటో, కవసాకిలు పొత్తు ఏర్పరుచుకున్నాయి. అప్పటి నుంచి పొత్తులో ఇవి సేవలందిస్తున్నాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా బజాజ్, కవసాకిల సహకార బంధాన్ని అలానే కొనసాగిస్తామని కంపెనీలు చెప్పాయి. ఇండియన్ సిటీల్లో విస్తరిస్తున్న కవసాకి ప్రస్తుతం 12 షోరూంలని కలిగిఉంది. 14 కవసాకి ఉత్పత్తులను విక్రయిస్తోంది. పరస్పర అంగీకారంతోనే తాము ఈ నిర్ణయానికి వచ్చామని బజాజ్ ఆటో తెలిపింది. 2017 ఏప్రిల్ 1కి ముందు, తర్వాత కవసాకి మోటార్ సైకిళ్లను కొన్నవారు ఇక నుంచి సేల్స్ సర్వీసు కూడా కవసాకిలోనే అందించనున్నారు. అయితే కేటీఎం బ్రాండుపై బజాజ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుందని తెలిసింది. కేటీఎం బ్రాండులో బజాజ్ కి 48 శాతం స్టాక్ ఉంది.