ఫలిస్తున్న షా వ్యూహం.. బీజేపీలోకి కేసీఆర్ బంధువు!
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా పట్టు చాటుకునేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మూడురోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఇతర పార్టీల్లోని పలు సీనియర్ నేతలకు కమలనాథులు గాలం వేశారు. పేరున్న నేతలను బీజేపీలోకి తీసుకునేందుకు పావులు కదిపారు. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొనేరీతిలో చేరికలు ఉండేలా కమలనాథులు వ్యూహం రచించినట్టు చెప్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు టీడీపీ, కాంగ్రెస్ నుంచి అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించే ఆయన అన్న కూతురు రమ్యను బీజేపీలోకి చేర్చుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న రమ్య.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న రోజున పార్టీ మారబోతున్నట్టు తెలిపారు. తెలంగాణలో బలోపేతం కావడమే లక్ష్యంగా బీజేపీ వలసలను ప్రోత్సహిస్తోంది.