తప్పే.. క్షమించండి: కేజ్రీవాల్ | Kejriwal apologises for Gajendra Singh's death | Sakshi
Sakshi News home page

తప్పే.. క్షమించండి: కేజ్రీవాల్

Published Sat, Apr 25 2015 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

తప్పే.. క్షమించండి: కేజ్రీవాల్ - Sakshi

తప్పే.. క్షమించండి: కేజ్రీవాల్

న్యూఢిల్లీ/జైపూర్: రాజస్థాన్ రైతు గజేంద్రసింగ్ ఉరేసుకొని చనిపోయిన తర్వాత కూడా సభలో ప్రసంగం కొనసాగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు తెలిపారు. ‘నేను గంటపాటు మాట్లాడాల్సి ఉంది. కానీ ఆ సంఘటన తర్వాత 10-15 నిమిషాలు మాట్లాడి ఆపేశాను. అది తప్పే. నేను మాట్లాడి ఉండాల్సింది కాదు. ఇది ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే అందుకు క్షమాపణలు వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు. రైతు మరణించినా, కనీసం భౌతికకాయం వద్దకు వెళ్లకుండా ప్రసంగం కొనసాగించడంపై కేజ్రీవాల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 
 దీనిపై ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘నాది తప్పే. నన్ను తిట్టండి. తప్పు చేసినవారిని ఉరితీయండి. కానీ ఈ క్రమంలో అసలు విషయం పక్కదారి పట్టకూడదన్నదే నేను కోరుకునేది. దీన్ని రాజకీయం చేయొద్దు. దేశంలో రైతు ఆత్మహత్యల పరంపర ఎందుకు కొనసాగుతుందో ఆలోచించాలి’ అని అన్నారు.   కాగా, కేజ్రీవాల్ క్షమాపణలను రైతు కుటుంబం తిరస్కరించింది. ఆయన మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ‘నా సోదరుడు చనిపోయాక ఇప్పుడు క్షమాపణలు చెబితే ఏమౌతుంది? ఆయన చనిపోయాక కేజ్రీవాల్ కనీసం 2 నిమిషాలు కూడా సభను ఆపలేదు’ అని గజేంద్ర సోదరి రేఖ  అన్నారు.
 
 ఆత్మహత్యపై తమకు అనేక అనుమానాలు ఉన్నందున సీబీఐ విచారణ జరిపించాలని మృతుడి మామ, నంగల్ జామర్‌వాడ గ్రామ సర్పంచ్ గోపాల్ సింగ్ డిమాండ్ చేశారు. కాగా, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్.. రాజస్థాన్‌లోని గజేంద్ర సొంతూరికి వెళ్లి ఆయన కుటుంబీకులను ఓదార్చారు. పార్టీ తరఫున రూ.10 లక్షల చెక్కు అందజేశారు. గజేంద్రకు అమరవీరుడి హోదాతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. సభ వీడియో దృశ్యాలను చూపుతూ రైతు మృతికి తాము కారణం కాదన్నారు.
 
 బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు
 కేజ్రీవాల్ క్షమాపణపై ఢిల్లీ బీజేపీ కమిటీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ మండిపడ్డారు. మూడ్రోజుల నుంచి దీనిపై మాట్లాడకుండా ప్రజలను, మీడియాను ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. కే జ్రీవాల్  క్షమాపణలతో సరిపెడితే చాలదని కాంగ్రెస్ పేర్కొంది.  గజేంద్రను ఉరికి ప్రోత్సహించి, తోసేశారా అని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని తేల్చడానికి దర్యాప్తు జరపాలన్నారు.
   
 టీవీ షోలో అశుతోష్ కన్నీళ్లు
 ‘ర్యాలీలో మా నాన్న ఉరేసుకొని చనిపోయినా ఎందుకు ప్రసంగాలను కొనసాగించారు?’ అంటూ ఓ టీవీ చానల్ కార్యక్రమంలో గజేంద్ర కూతురు మేఘన(17) అడిగిన ప్రశ్నకు ఆప్ నేత అశుతోష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నేను పాపినే. ఆ వేదిపై నేనూ ఉన్నా. అయినా ఆయన్ను కాపాడలేకపోయాం’ అని అన్నారు.
 
 కలెక్టర్ విచారణకు సహకరించని పోలీసులు
 
 రైతు గజేంద్ర ఆత్మహత్యపై ఢిల్లీ సర్కారు ఆదేశాలతో విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్‌కు పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. కేసు వివరాలు కలెక్టర్‌కు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా కేసు వివరాలు సమర్పించాలని జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ కోరినా.. పోలీసులు ఆ వివరాలేవీ ఇవ్వలేదు. తాము ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాక మేజిస్ట్రేట్ విచారణ అవసరం లేదని వారు చెబుతున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్రం చేతిలో ఉన్నందున కేసును తమకు అనుకూలంగా మార్చుకుంటుందన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement