సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం మళ్లీ జరుపుకుంటామో.. లేదో అన్న అయోమయం కలుగుతోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా, తెలుగు జాతి ఒక్కటిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని తెలుగువారందరికీ నా అభివందనాలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. ఈ ఉత్సవం ప్రతియేటా ఇలాగే కొనసాగాలని తెలుగుతల్లిని ప్రార్థిస్తున్నా అంటూ ముగించారు.
తెలుగు మాట్లాడేవారందరికీ ఒక రాష్ట్రం సాధనకు ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేయగా పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం, బూర్గుల రామకృష్ణారావు పదవీత్యాగం చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఉన్నత శిఖరాలకు ఎదిగి భారతదేశానికి దశ, దిశ చూపిన నీలం సంజీవరెడ్డి, పీపీ నరసింహారావు వంటి తెలుగువారందరికీ జోహార్లు అర్పిస్తున్నామన్నారు. 1956 నవంబర్ 1న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ తెలుగుజాతి సమైక్యత కోసం గట్టి బంధాలు వేశారని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఎంతో ముందుచూపుతో రానున్న వందేళ్ల గురించి ఆలోచిస్తున్నాం. విశాలాంధ్ర నినాదం ఇంకా నా చెవుల్లో మార్మోగుతూ ఉంది. నేను గట్టి సమైక్య వాదిని’ అని 1972 డిసెంబర్ 21న పార్లమెంటులో ఇందిరాగాంధీ చెప్పిన మాటలను సీఎం తన ప్రసంగంలో ఉటంకించారు.
‘తెలుగు ప్రాంతమంతా ఒక రాష్ట్రంగా ఉండటం వల్లనే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులు నిర్మించుకోగలిగాం. మన మాటకు విలువ ఇస్తున్నారంటే తెలుగుజాతి ఒక్కటిగా ఉండటం వల్లే..’ అని చెప్పారు. ‘కష్టపడి దూరదృష్టితో శ్రమించే ప్రజలు, అంకితభావంతో పనిచేసే అధికార యంత్రాంగం, రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మలిచిన రైతూ మన సొత్తు. అందువల్లే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోగలుగుతున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలుగుతున్నాం. మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, వనరులను రాబోయే తరాలకు అందించడం మన కనీస కర్తవ్యం. కానీ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఒక అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు..’ అని సీఎం అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ... అనే పాటతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇలావుండగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయం వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ తదితరులు పాల్గొన్నారు.
కళ తప్పిన ఉత్సవం: రాష్ట్ర అవతరణ దినోత్సవం సాదాసీదాగా, మమ అనే చందంగా సాగింది. దానం నాగేందర్ మినహా తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో ఇది సీమాంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనే విధంగా ఉంద నే వ్యాఖ్యలు విన్పించాయి. సాధారణంగా నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ సేపు కొనసాగే ఈ కార్యక్రమం ఈసారి అరగంట ముందే ముగియడం గమనార్హం. ముఖ్యమంత్రి కూడా కేవలం ఆరు నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించారు. ప్రముఖులు ఎక్కువమంది హాజరుకాకపోవడంతో వీఐపీ లాంజి బోసిపోయింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, రఘువీరారెడ్డి, టీజీ వెంకటేష్, పితాని సత్యనారాయణ, మండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, క్రిస్టినా లాజరస్ మినహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. పరేడ్ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మాత్రం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసు, అటవీ, ప్రభుత్వశాఖలలో విశేష ప్రతిభ కనపరిచిన పలువురు అధికారులు, సిబ్బందికి, విద్యార్థులకు ముఖ్యమంత్రి పతకాలను అందజేశారు. ఏపీఎస్పీ 12వ బెటాలియన్‌కు బెస్ట్ ఆర్ముడ్ కంటిన్జెంట్ అవార్డు లభించింది.