
మళ్లీ తెరపైకి కిరణ్‌కుమార్‌రెడ్డి!
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తిరిగి హస్తం గూటికి చేరేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్టు చెప్తున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. విభజన బిల్లును వ్యతిరేకించి.. చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తిరిగి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని, ఇందులోభాగంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో తనకు తెలిసిన కాంగ్రెస్ పెద్దలతో కిరణ్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.