ఆ వీడియో చూస్తే చాలు.. ఆసిస్ దిగ్గజంపై కోహ్లి ఫైర్!
మొదటి టెస్టులో మూడురోజుల్లోనే టీమిండియా ఓటమిపాలైన నేపథ్యంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసిస్ క్రికెట్ దిగ్గజాలు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కోహ్లి వాగ్వాదానికి దిగడాన్ని వారు తప్పుబట్టారు. మొదటి టెస్టులో, రెండో టెస్టులో కోహ్లి తక్కువ స్కోరుకే అవుటవ్వడంపై స్పందిస్తూ కామెంటర్‌గా ఉన్న మాథ్యూ హెడెన్.. కోహ్లి బుర్రలో ఏముందో ఆసిస్ బౌలర్లు పసిగట్టారంటూ కామెంట్ చేశాడు. ఆసిస్ మాజీ బ్యాట్స్‌మన్, జాతీయ సెలక్టర్ మార్క్ వా స్పందిస్తూ మొదటి టెస్టులో కోహ్లి ఔటైన తీరు చూస్తే.. అతని దిమాగ్ కొంత ఖరాబైందేమోననిపిస్తున్నదని పేర్కొన్నాడు. ఇక మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ అయితే ఒక అడుగు ముందుకువేసి.. ఆటలో కోహ్లి తీరు చూస్తుంటే.. అతనిపై తనకు గౌరవం లేకుండాపోయిందని దురుసుగా వ్యాఖ్యానించాడు.
బెంగళూరు టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో హేలీ వ్యాఖ్యలపై తాజాగా కెప్టెన్ కోహ్లి స్పందించాడు. 'అతని దృష్టిలో నాపై గౌరవం పోయిం ఉండొచ్చు. కానీ భారత్‌లోని 120 కోట్లమంది గౌరవం మాకుంది. ఆ ఒక్కడి వల్ల నా జీవితంలో పెద్ద మార్పేమీ ఉండదు. సెంచూరియన్ టెస్టులో అతన్ని ఎంపైర్ ఔట్‌గా ప్రకటించినప్పుడు అతడు ఎలా ప్రవర్తించాడో, ఏమన్నాడో తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. మీకే తెలిసిపోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడండి' అంటూ కోహ్లి కామెంట్ చేశాడు.
1997లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇయాన్ హేలీ అనుచితంగా వ్యవహరించాడు. బ్రేట్ షుల్జ్ బౌలింగ్‌లో బంతిని కీపర్ డేవ్ రిచర్డ్‌సన్ (ప్రస్తుత ఐసీసీ సీఈవో) అందుకోవడంతో ఎంఫైర్ లెగ్‌సైడ్ క్యాచ్‌గా ప్రకటించాడు. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే తనను ఔట్‌గా ప్రకటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హేలీ మైదానంలోని ఓ ప్రేక్షకుడి వైపు బ్యాటును తుపాకీలా చూపించి బెదిరించాడు. అంతేకాకుండా డ్రేసింగ్ రూమ్ మెట్లు ఎక్కుతూ బ్యాటును కోపంగా విసిరేశాడు. (బు.. షి.. ఎంపైరింగ్) అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఆనాటి ఘటనను తాజాగా కోహ్లి గుర్తుచేశాడు.