
ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పం: కేటీఆర్
‘ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పబోం.. ఆచరణ సాధ్యమైన వాటినే ప్రజలకు చెప్తాం’ అని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పబోం.. ఆచరణ సాధ్యమైన వాటినే ప్రజలకు చెప్తాం’ అని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ పార్టీల నుంచి గురువారం తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ భవన్‌లో అప్పుడే గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన వాతావరణం కనిపిస్తోందని.. ఇతర పార్టీల కార్యాలయాలు బోసిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే నాలుగేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేటీఆర్ అన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తప్ప ఇతర పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. కొన్ని పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తూ విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మతం పేరిట రాజకీయాలు చేయడం మానుకుని, హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ చేసిన కృష్టి ఏమిటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 18 నెలల కాలంలో రాష్ట్రానికి రాకపోవడంపై మరోమారు విమర్శలు చేసిన కేటీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో జీహెచ్‌ఎంసీలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, మెహిదీపట్నంకు చెందిన బంగారు ప్రకాశ్, కార్వాన్ నుంచి జీవన్ సింగ్, సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.