సర్జికల్ స్ట్రైక్స్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరుపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కూడా సైన్యం నిర్దేశిత దాడుల(సర్జికల్ స్ట్రైక్స్)పై ట్విట్టర్‌లో స్పందించారు. పాక్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై దాడులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశమే ముఖ్యమని, అందుకే, కేంద్ర ప్రభుత్వానికి బలంగా మద్దతునిస్తున్నాని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలుకు అండగా నిలబడాలని, రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరిగే మెట్రో పనులకు చార్జీలు వసూలు చేయడాన్ని నిలిపివేయాలని ఆయనను కోరారు. సురేశ్ ప్రభు ప్రతిస్పందన తమకు ఆనందం కలిగించిందని చెప్పారు. అంతకుముందు కేంద్ర గనులశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసి.. ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీలు ప్లాంట్ ఏర్పాటును ముమ్మరం చేయాలని కోరారు.