సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ఆధారాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీసిన సంగతి తెలిసిందే. అయితే వ్యవహారం డర్టీ పాలిటిక్స్‌కు తెర తీసింది. రాహుల్ గాంధీకి మద్ధతుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. బీజేపీని, రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఇవాళ అవతలి నుంచి సీఎం కేసీఆర్‌కు కౌంటర్ పడింది.
రాహుల్ లాగే తాను కూడా కేంద్రాన్ని అదే డిమాండ్ చేస్తున్నానని... సర్జికల్ స్ట్రయిక్స్‌కు ఆధారాలు చూపాలని అడుగుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డియర్ కేసీఆర్ గారూ, మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌కు వీడియోగ్రాఫిక్ సాక్ష్యం. అయినప్పటికీ మీరు మా సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు. సైనికులను అవమానిస్తున్నారు. మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. మన సైన్యాన్ని అవమానిస్తే నవ భారతదేశం సహించదు అంటూ కూ యాప్‌లో పోస్ట్ చేశాడాయన.
పుల్వామా దాడి వార్షికోత్సవం సందర్భంగా సర్జికల్ స్ట్రయిక్స్ ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయని హిమంత అంటున్నారు. నెహ్రూ కుటుంబం తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో వారు సైన్యానికి ద్రోహం చేసేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సైన్యం పట్ల తనకు ఎంతో విధేయత ఉందని, జీవితకాలమంతా తనను విమర్శించినా పట్టించుకోబోనని తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీని ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని.. ఆయన(రాహుల్) రాజీవ్ కు పుట్టారనే ఆధారాలను బీజేపీ ఎప్పుడైనా అడిగిందా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు నేతలు.. హిమంతపై నిప్పులు చెరగ్గా.. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు. హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సైతం బీజేపీని డిమాండ్ చేశారు కేసీఆర్.
Comments
Please login to add a commentAdd a comment