
సమాధిపై అధర సంతకం..
ఇది ప్రఖ్యాత ఐరిష్ రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ తాలూకు సమాధి. ప్యారిస్‌లో ఉంది. సమాధిపై లిప్‌స్టిక్ ముద్రలు చూశారా.. అవన్నీ ఆయన తాలూకు మహిళా అభిమానులు తమ అధరాలతో చేసిన సంతకాలు.. ఆస్కార్ వైల్డ్ 1900లో చనిపోయారు. అయితే.. ఈ ముద్దుల ముచ్చట చాన్నాళ్లపాటు లేదట. ఈ ట్రెండ్ మొదలైంది 1990ల్లోనట. తొలుత చూసీచూడనట్లు ఊరుకున్న అధికారులు.. తర్వాత సమాధి మొత్తం ముద్దులతోనే నిండిపోవడంతో రూ.6 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరికలు చేశారు.. అయినా ఎవరైనా పట్టించుకుంటేగా.. ఆపితేగా.. వీటిని చెరపడానికి అయ్యే ఖర్చు తడిసి మోపెడవడం మొదలైంది. పదే పదే శుభ్రపరచడం వల్ల సమాధి కూడా దెబ్బతినడం ప్రారంభించింది.
దీంతో 2011లో చుట్టూ గాజు గోడ కట్టారు. అభిమానులు ఊరుకున్నారా? దానికి లిప్‌స్టిక్ ముద్దులు అంటించేయడం మొదలెట్టారు. అయితే.. ఇది కొంతలో కొంత బెటరే కనుక.. గాజును క్లీన్ చేయడం సులభమే కనుక అధికారులు కూడా లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు.