24 రైళ్ల మళ్లింపు లేదా రద్దు
భువనేశ్వర్: పై-లీన్ పెను తుపాను దృష్ట్యా శనివారం హౌరా-చెన్నయ్ ప్రధాన మార్గంలోని విశాఖపట్నం-భద్రక్‌ల మధ్య రాకపోకలు సాగించే 24 ప్యాసింజర్ రైళ్లను మళ్లించడం లేదా రద్దు చేయాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే భావిస్తోంది. కటక్-పలాస-కటక్, పలాస-భువనేశ్వర్-పలాస, విశాఖ-పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-పలాస-విశాఖ మెము, విశాఖపట్నం-విజయనగరం-విశాఖపట్నం మెము, పలాస-గునుపూర్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారాదీప్, పూరి, అన్గుల్, తాల్చేర్ అనుబంధ లైన్లలో రాకపోకలు సాగించే పలు లోకల్ రైళ్లను కూడా మళ్లించడం లేదా రద్దు చేయనున్నారు.
సైన్యం అప్రమత్తం
న్యూఢిల్లీ: పై-లీన్ పెనుతుపాను దృష్ట్యా సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో సహాయ కార్యక్రమాల నిమిత్తం తరలివెళ్లేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ శుక్రవారం సూచించారు. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఇల్యూషిన్-76, సి-130జె సూపర్ హెర్క్యులస్, అన్‌టోన్వీ-32 రవాణా విమానాలతో పాటు మొత్తం 24 విమానాలను మోహరింపజేసింది. 18 హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. రెండు వైమానిక విమానాలు ఇప్పటికే జాతీయ విపత్తు సహాయ దళాలను, అవసరమైన సామగ్రిని భువనేశ్వర్‌కు తరలించాయి. రాయ్‌పూర్, నాగపూర్, జగదల్‌పూర్, బర్రాక్‌పూర్, రాంచి, గ్వాలియర్‌తో పాటు పలు స్థావరాల్లో వైమానికదళ యంత్రాగాన్ని సిద్ధంగా ఉంచారు. బర్రాక్‌పూర్‌లో మోహరించి ఉన్న టాస్క్‌ఫోర్స్‌తో కలిసి సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌కు ఆదేశాలు జారీ చేశారు. నౌకాదళం సహాయ కార్యక్రమాల కోసం చేతక్, యూహెచ్-3హెచ్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచింది. విశాఖలోని తూర్పు నౌకాదళం డైవింగ్ బృందాలను సిద్ధం చేసింది.
35 పెనుతుపాన్లలో 26 బంగాళాఖాతంలోనే!
ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా అతి తీవ్రమైన ఉష్ణమండల(ట్రాపికల్) సైక్లోన్లు 35 సంభవించగా.. వాటిలో 26 పెనుతుపాన్లు బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయి. గత రెండు శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రాపికల్ సైక్లోన్ల వల్ల జరిగిన మరణాల్లో 42 శాతం బంగ్లాదేశ్‌లో, 27 శాతం భారత్‌లోనే సంభవించాయి. - జెఫ్ మాస్టర్స్ (అంతర్జాతీయ వాతావరణ నిపుణుడు)
పెను గాలుల్లో బయటకు వద్దు
పై-లీన్ ప్రచండ తుపానుగా మారిందని, దీని తీవ్రత ముందుగా ఊహించినదానికంటే చాలా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘‘1994లో సూపర్ సైక్లోన్ వచ్చింది. దాని తర్వాత ఈ పై-లీన్ తుపానే అతి పెద్దది, తీవ్రమైనది. దీని ప్రభావం వల్ల శ్రీకాకుళంలో సముద్రం 3మీటర్ల మేరకు ఉప్పొంగే ప్రమాదముంది. శనివారం సాయంత్రం తుపాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతంలో గంటకు 210 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయి. చెట్లు, పూరిళ్లు, రేకుల షెడ్లు కూలిపోయే ప్రమాదముంది. మైదానంలోని రహదారుల్లో ప్రయాణించే వాహనాలు గాలుల తీవ్రతకు పల్టీకొట్టే ప్రమాదం ఉంది. గాలుల సమయంలో బయటకు వెళ్లవద్దు. పూరిళ్లు, రేకుల షెడ్లలో ఉండవద్దు’’ అని సూచించింది.
పై-లీన్ పెను తుపాను.. అన్నింటా అప్రమత్తం
Published Sat, Oct 12 2013 3:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement