లలిత్ మోదీ.. బ్రిటన్ టూ కరీబియన్!
లండన్:ఆర్థిక నేరారోపణలతో భారత్ నుంచి బ్రిటన్కు పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ చట్టం నుంచి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భారత్ లో అతనిపై ఉచ్చు బిగుసుకోవడంతో బ్రిటన్ నుంచి కరీబియన్కు వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సెయింట్ లూసియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ పెట్టుబడుల స్కీమ్ ద్వారా కరీబియన్ పౌరసత్వాన్ని పొందాలని భావిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత తక్కువ మొత్తంలో పన్ను చెల్లించే వెసులుబాటు సెయింట్ లూసియాలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో పాటు సెయింట్ లూసియానాలో బ్యాంకింగ్ స్టాండర్డ్స్ అత్యంత గోప్యత కల్గి ఉండటం కూడా అక్కడ పౌరసత్వంపై మోదీ ఆసక్తి కనబరచడానికి మరో కారణం. తన కుటుంబంతో కలిసి సెయింట్ లూసియా పౌరసత్వానికి మోదీ దరఖాస్తు చేసినట్లు జాతీయ మీడియాలో వెలుగు చూసింది. కాగా, వివాదాస్పద లలిత్ మోదీ తమ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేయడంపై సెయింట్ లూసియా ఇంటర్ పోల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అతనిపై ఏ విధమైన క్రిమినల్ కేసులు లేవని స్పష్టత వచ్చిన పక్షంలోనే తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వాలని సెయింట్ లూసియా భావిస్తోంది.