'లాలూ నకిలీ యాదవ్.. నేనే ఒరిజినల్'
పట్నా: పప్పూ యాదవ్.. బిహార్ ఎన్నికలు అనగానే లాలాప్రసాద్ యాదవ్‌తోపాటు గుర్తొచ్చే మరో యాదవ్ సామాజిక వర్గం నాయకుడు ఈయన. పేరొందిన నేరచరితుడు. మధేపురా ప్రాంతానికి రాబిన్‌హుడ్. రాజకీయాల్లో బాహుబలిలా పేరొందిన ఆయన ప్రస్తుతం జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకొని బిహార్ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఒకప్పుడు లాలూకు సన్నిహితుడైన పప్పూ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రధానంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. యాదవ్ సామాజిక వర్గంలో లాలూ తర్వాత అంతటి నాయకుడు అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నారు.
మాధేపురా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ప్రధానంగా ఐదో దశ ఎన్నికలు జరుగనున్న సీమాంచల్ ప్రాంతంపై దృష్టి పెట్టారు. ఇక్కడ యాదవ సామాజిక వర్గం ఎక్కువ. ఇక్కడ అత్యధిక సీట్లు కొల్లగొట్టాలని లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. లాలూ ప్రయత్నాలకు గండి కొట్టేందుకు పప్పూ ప్రయత్నిస్తున్నారు. ఎయిర్‌బస్ 130 హెలికాప్టర్‌లో ఈ ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన ప్రధానంగా లాలూపైనే గురిపెడుతున్నారు. 'లాలూ నకిలీ యాదవ్. నేను అసలైన యాదవ్‌ను' అని చెప్తున్నారు.
యాదవ్ సామాజిక వర్గంలో లాలూ ఓటుబ్యాంకును దెబ్బతీయడానికే బీజేపీ వ్యూహాత్మకంగా పప్పూ రంగంలోకి దింపినట్టు భావిస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ "లాలూ తన చుట్టూ భజనపరులనే ఉంచుకుంటారు. ఒకప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న యాదవ్‌లను ఇప్పుడు పార్టీ నుంచి గెంటేశారు. యాదవ్‌లను ఆయన ఓటుబ్యాంకుగానే చూస్తున్నారు. కానీ యాదవ్ సామాజికవర్గం అభ్యున్నతి కృషి చేస్తున్నాను' అని చెప్తున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.