ఔను! ఆ ఆస్తులు మావే.. అంగీకరించిన లాలూ
పట్నా: బినామీల పేరిట ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం భారీగా ఆస్తులు పోగేసుకుంటున్నదంటూ బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ చేసిన ఆరోపణలపై తాజాగా లాలూ స్పందించారు. బిహార్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ను నిర్మిస్తున్న పట్నాలోని రెండు ఎకరాల భూమి తమ కుటుంబానిదేనని లాలూ అంగీకరించారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్‌లో కూడా తమకు 50శాతం వాటా ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు.
‘మాల్ నిర్మాణంలో ఉన్న భూమి లారా ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీకి చెందినది. ఈ కంపెనీలో రబ్రీదేవికి, తేజ్ ప్రతాప్‌కు, తేజస్వికి వాటాదారులు. మేమే మా భూమిని మెరిడియన్ కన్‌స్ట్రక్చన్ కంపెనీకి మాల్ నిర్మాణానికి ఇచ్చాం. మా కుటుంబానికి కొంత భూమి ఉన్నప్పుడు దానిని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోకూడదా? ఏం ’ అంటూ ఆయన ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న మాల్‌లో 50శాతం వాటా తమదని, మిగతా 50శాతం బిల్డర్‌దని చెప్పుకొచ్చారు.
2005లో లాలూ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు రైల్వేశాఖకు చెందిన రెండు హోటళ్లను హర్ష్ కొచర్ అనే వ్యాపారవేత్తకు ఇచ్చారని, అందుకు ప్రతిఫలంగానే పట్నాలోని ఈ ఖరీదైన భూమిని ఆయనకు ముట్టజెప్పారని బీజేపీ ఆరోపించగా.. ఆ ఆరోపణల్ని లాలూ తోసిపుచ్చారు.