గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Nov 30 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

గతవారం బిజినెస్

గతవారం బిజినెస్

2 లక్షల కోట్లు సమీకరించిన కంపెనీలు
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ బాండ్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.2.04 లక్షల కోట్ల నిధులు సమీకరించాయని ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. నిధుల సమీకరణలో ఆర్థిక సేవల రంగ కంపెనీలు అగ్రస్థానంలో, ఆ తర్వాతి స్థానంలో విద్యుత్ రంగం కంపెనీలు ఉన్నాయి. కంపెనీల వారీగా చూస్తే రూ.19,312 కోట్లు సమీకరించి పవర్ ఫైనాన్స్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో ఎల్‌ఐసీ హౌసింగ్ (రూ.10,768 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.9,701 కోట్లు), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొ(రూ.8,121 కోట్లు). ఐడీఎఫ్‌సీ (రూ.7,042 కోట్లు) ఉన్నాయి.
  
పెరిగిన పీ-నోట్స్ పెట్టుబడులు
 పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా భారత క్యాపిటల్ మార్కెట్లోకి పెట్టుబడులు వరుసగా రెండో నెలా పెరిగాయి. అక్టోబర్‌లో భారత క్యాపిటల్ మార్కెట్లోకి (ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్ విభాగాలు) రూ. 2.58 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో వచ్చిన పెట్టుబడుల విలువ రూ. 2,53,875 కోట్లు. భారత్‌లో నమోదైన విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల ద్వారా సంపన్న విదేశీ ఇన్వెస్టర్లు, హెడ్జ్ ఫండ్స్, ఇతర విదేశీ సంస్థలు పీ-నోట్స్ రూపంలో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు.
  
ఐవీఆర్‌సీఎల్‌లో 5% దాటిన ఐడీబీఐ వాటా
ఆర్థిక కష్టాల్లో ఉన్న నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్ తీసుకున్న రుణాలకు వడ్డీల బదులు ఈక్విటీలను జారీ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఐడీబీఐ బ్యాంక్‌కు 39.40 లక్షల షేర్లను జారీ చేయడం జరిగింది. ఫండెడ్ ఇంట్రెస్ట్ టర్మ్ లోన్ (ఎఫ్‌ఐటీఎల్) ఒప్పందంలో భాగంగా ఈ షేర్లను కొనుగోలు చేసినట్లు ఐడీబీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ తాజా షేర్లతో ఐవీఆర్‌సీఎల్‌లో ఐడీబీఐ బ్యాంక్ వాటా 4.77 శాతం నుంచి 5.32 శాతానికి పెరిగింది.
  
2వేల కోట్లు చెల్లించనున్న వీఎంఎస్‌ఎల్
 వేర్వేరుగా ఉన్న నాలుగు లెసైన్సుల విలీనానికి రూ. 2,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ లిమిటెడ్ (వీఎంఎస్‌ఎల్)కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ చెల్లింపులు ఎప్పుడు పూర్తయితే అప్పుడు... కేంద్రం విలీన ప్రక్రియకు అనుమతిస్తుందని న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. లెసైన్సుల తాత్కాలిక విలీనానికి అనుమతి ఇస్తూ... టెలికం వివాదాల పరిష్కార, అప్పీలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్‌ఏటీ) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ఇచ్చింది.

తగ్గనున్న ముడిచమురు దిగుమతుల బిల్లు
అంతర్జాతీయంగా బలహీన డిమాండ్‌తో ముడిచమురు ధరలు క్షీణించిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం భారత్ క్రూడ్ దిగుమతుల బిల్లు 35 శాతం మేర తగ్గనుంది. 73.28 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 4.73 లక్షల కోట్లు) పరిమితం కానుంది. 2014-15లో సుమారు 112 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.87 లక్షల కోట్లు) విలువ చేసే 189 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. ఈసారి దాదాపు 188 మిలియన్ టన్నుల దాకా దిగుమతి చేసుకోవచ్చని అంచనా.
  
రూపే కార్డు బీమాకు కాల పరిమితి పొడిగింపు

రూపే కార్డుకు సంబంధించి ప్రమాద బీమా క్లెయిమ్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. ఏదైనా ఒక ప్రమాద సంఘటన విషయంలో... క్లెయిమ్‌కు ముందు కార్డు వినియోగ కాలాన్ని (కార్డ్ యూసేజ్ కండీషన్) 90 రోజుల వరకూ పొడిగించింది. ఇప్పటి వరకూ ఈ పరిమితి 45 రోజులుగా ఉంది.   నవంబర్ 25 నుంచీ తాజా నిబంధన అమల్లోకి వస్తుంది. ప్రధాన మంత్రి జన్  ధన్ యోజన (పీఎంజేడీవై) కింద జారీ అయిన రూపే డెబిట్ కార్డుపై లక్ష వరకూ ప్రమాద బీమా కవరేజ్ ఉంది. ఈ పథకం కింద ఇప్పటి వరకూ దాదాపు 16.54 కోట్ల మందికి రూపే కార్డులు జారీ అయ్యాయి.
   
మైక్రోఫైనాన్స్ సంస్థలిచ్చే రుణ పరిమితి పెంపు
 బ్యాంకింగ్‌యేతర ఫైనాన్స్-సూక్ష్మ రుణాల సంస్థలు దీర్ఘకాలానికి ఇచ్చే రుణాల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ రెట్టింపు చేసింది. దీంతో ఇకపై 24 నెలల వ్యవధికి ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎఫ్‌ఐలు రూ. 30,000 దాకా రుణం ఇవ్వొచ్చు. ఇప్పటిదాకా ఈ పరిమితి రూ. 15,000గా ఉంది. 24 నెలల లోపు గడువుకి జారీ చేసే రుణాల పరిమితి పెంచాలన్న పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
   
రెండేళ్ల కనిష్టానికి రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 19 పైసలు క్షీణించి 66.76 వద్ద ముగిసింది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. నెల చివర కావడంతో దిగుమతిదారులు, కొన్ని బ్యాంక్‌ల నుంచి డాలర్‌కు  డిమాండ్ బాగా ఉండటంతో రూపాయి విలువ ఈ స్థాయిలో క్షీణించిందని నిపుణులంటున్నారు. విదేశీ నిధులు తరలిపోవడం కొనసాగుతుండడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని వారంటున్నారు.
   
జీవీకే బయోసెన్సైస్ ఎఫ్‌డీఐకి ఓకే

 జీవీకే బయోసెన్సైస్‌కు చెందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం లభించింది. మొత్తం రూ.160 కోట్ల విలువైన మూడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన గల విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ)  ఆమోదం తెలిపింది.
  
పునరుత్పాదక విద్యుత్ రంగానికి ఫండ్

పునరుత్పాదక విద్యుత్ రంగానికి ఊతమిచ్చే విధంగా 1 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 6,500 కోట్లు) ప్రై వేట్ ఈక్విటీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అలాగే పర్యావరణ అనుకూల విద్యుత్పత్తికి తోడ్పాటునిచ్చేలా రాబోయే మూడు-నాలుగేళ్లలో ఏటా 4 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.
   
రూ.246 కోట్ల బంగారం బాండ్లు
 ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన పసిడి పథకాల విషయం లో... బాండ్లకు మంచి స్పందన లభించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డిపాజిట్ల పథకం నిరుత్సాహకరంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. నవంబర్ 5 నుంచి 20  వతేదీ మధ్య తొలి దశ గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరిగిన సంగతి తెలిసిందే.  గోల్డ్ బాండ్ల కోసం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 63,000 దరఖాస్తులు అందాయి. విలువ రూపంలో రూ. 246 కోట్లు.
   
మొబైల్ సర్వీస్ రంగ విశ్వరూపం!
భారత్‌లో మొబైల్ సర్వీసుల రంగం భారీగా విస్తరించనుంది. 2020 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 8.2 శాతానికి (దాదాపు రూ. 14 లక్షల కోట్లు) చేరుతుందని గ్లోబల్ టెలికం ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ జీఎస్‌ఎంఏ పేర్కొంది.  2014లో ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపింది. 2020 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని అభిప్రాయపడింది.
   
4జీ స్మార్ట్‌ఫోన్ల జోరు

భారత్‌లో 4జీ స్మార్ట్‌పోన్ల జోరు పెరుగుతోంది. ఈ  ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 21 శాతం వృద్ధితో 2.83 కోట్లకు పెరిగాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. చౌక ధర 4జీ ఫోన్లకు డిమాండ్ మూడు రెట్లు పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఐడీసీ తెలిపింది.
 
డీల్స్..

 
ఇంగ్లాండ్‌కు చెందిన బుపా కంపెనీ.. భారత ఆరోగ్య బీమా వెంచర్ మ్యాక్స్ బుపాలో తనకున్న 26 శాతం వాటాను 49 శాతానికి  పెంచుకోనున్నది. దీనికి రూ.191 కోట్లు చెల్లించనున్నదని మ్యాక్స్ గ్రూప్ ఎండీ రాహుల్ ఖోస్లా చెప్పారు. మ్యాక్స్ ఇండియా, బుపా కంపెనీలు కలసి 74:26 నిష్పత్తిలో మ్యాక్స్ బుపా బీమా కంపెనీని ఏర్పాటు చేశాయి.

ఫార్మా రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీస్తూ బొటాక్స్ తయారీ సంస్థ అలెర్గాన్, అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్ విలీనం కానున్నాయి. ఈ డీల్ విలువ దాదాపు 160 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 10,40,000 కోట్లు) ఉండనుంది. తద్వారా ప్రపంచంలోనే నంబర్ వన్ ఫార్మా సంస్థ ఏర్పాటు కానుంది.

టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా సింగపూర్ కు చెందిన క్రేయాన్ డేటా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. జంగిల్ వెంచర్స్‌కు చెందిన ఈ క్రేయాన్ డేటా కంపెనీలో ఆయన ఎంత పెట్టుబడులు పెట్టింది వెల్లడి కాలేదు.

టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దేశీయంగా తొలి స్పెక్ట్రం ట్రేడింగ్ ఒప్పందానికి తెరతీశాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్ (పశ్చిమం)లో వీడియోకాన్‌కి ఉన్న టెలికం స్పెక్ట్రంను కొనుగోలు చేసేందుకు ఐడియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 3,310 కోట్లు చెల్లించనుంది. ఈ సర్కిళ్లలో వచ్చే ఏడాది 4జీ సర్వీసులు ప్రారంభించేందుకు ఈ స్పెక్ట్రంను ఉపయోగించుకోనున్నట్లు ఐడియా తెలిపింది.

రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మరో 23 శాతం వాటాను జపాన్‌కు చెందిన నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.2,265 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో తమ వాటా 49 శాతానికి చేరిందని నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది.

మహీంద్రా గ్రూప్‌కు చెందిన యూజ్‌డ్ కార్ల విక్రయ సంస్థ మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్‌లో అమెరికాకు చెందిన కాక్స్ ఆటోమోటివ్ కొంత వాటాను కొనుగోలు చేసింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement