పూర్తి వివరాలను మా ముందుంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఓటర్ల జాబితాలో ఉన్న 7.90 లక్షల డూప్లికేట్ పేర్ల తొలగింపు విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(సీఈసీ) హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని సీఈసీ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓటర్ల జాబితాలో 7.90 లక్షల డూప్లికేట్ పేర్లు ఉన్నాయని, వాటిని ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలగిస్తామంటూ సీఈసీ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన మహేశ్‌గౌడ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు కోర్టు ప్రారంభం కాగానే.. ఎన్నికల విషయంలో కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయని, ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు ఉన్నట్లు సీఈసీనే అంగీకరించిందని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.
బోగస్ ఓట్లు అనడంతో అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరిస్తూ.. విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగా, ఓటర్ల జాబితాలో 7.90 లక్షల డూప్లికేట్ పేర్లు ఉన్నట్లు అంగీకరించిన సీఈసీ, వాటిని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాతే తొలగిస్తామంటూ గత నెల 17న ప్రొసీడింగ్స్ జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఉదయం ఈ కేసు గురించి ప్రస్తావించేటప్పుడు బోగస్ ఓట్లని చెప్పారు.
ఇప్పుడు డూప్లికేట్ పేర్లు అని చెబుతున్నారు. బోగస్‌కు, డూప్లికేట్‌కు చాలా తేడా ఉంది. ఈ విధంగా చెప్పడం సరికాదు. డూప్లికేట్ ఓట్లు బోగస్ ఓట్లు కానే కాదు. ఒకవ్యక్తి పేరే రెండు మూడుసార్లు ఓటర్ల జాబితాలో పునరావృతమైతే అది డూప్లికేట్ అవుతుందే తప్ప బోగస్ కాదు. మీరు ఊహల ఆధారంగా వాదనలు చేస్తున్నారే తప్ప, వాస్తవాల ఆధారంగా కాదు. ఊహలను మేం అంగీకరించబోం’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
డూప్లికేట్ పేర్లను తొలగించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని సీఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్‌ను ప్రశ్నించింది. నోటీసులు జారీ చేసిన తర్వాతే తొలగింపునకు చర్యలు తీసుకుంటామని అవి నాశ్ తెలిపారు. నోటీసుల అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించగా, నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తే కోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పారు. అయితే 7.90 లక్షల డూప్లికేట్ పేర్ల తొలగింపునకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.
గడువు పెంచండి..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ గడువును మరో 45 రోజుల పాటు పొడిగించాలంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణపై దాఖలైన వ్యాజ్యాల్లో కోర్టుకిచ్చిన హామీ మేరకు ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ, పురపాలక శాఖ విఫలమయ్యాయని, ఉద్దేశపూర్వకంగానే వారు గడువు పొడిగింపు కోరకుండా ప్రభుత్వానికి మేలు చేస్తున్నారని శశిధర్‌రెడ్డి తన పిటిషన్‌లో ఆరోపించారు.
డిసెంబర్ 15 నాటికి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని విధివిధానాలను పూర్తి చేసి, ఆ తర్వాత 45 రోజులకు అంటే జనవరి 31, 2016కల్లా ఎన్నికలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎన్నికలకు ముందు విధివిధానాలనే పూర్తి చేయలేదని, దీనివల్ల అభ్యంతరాలు తెలిపేందుకు ఓటర్లకు గడువు లేకుండాపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. హైకోర్టు నిర్దేశించిన గడువుకు 3 వారాల వెనక ఉన్నారని, ఈ నెల 31కల్లా ఎన్నికలు పూర్తిచేయడం అవదన్నారు. గడువు పెంచకుంటే బీసీ ఓటర్లకు, రాజకీయ పార్టీలకు నష్టం కలుగుతుందన్నారు.