లాయర్ల ఫీజులు భారీగా పెంపు
ఉచిత న్యాయసలహా కేంద్రాలలో భాగంగా అండర్ ట్రయల్ ఖైదీల తరఫున వాదించే న్యాయవాదులకు చెల్లించే ఫీజులు మరీ దారుణంగా ఉంటున్నాయని, వాటిని గణనీయంగా పెంచాలని కర్ణాటకలోని ఓ ప్రత్యేక జడ్జి ప్రభుత్వానికి సూచించారు. న్యాయసలహా కేంద్రం కింద వాదించే న్యాయవాదులకు ఒక్కో కేసుకు కేవలం రూ. 900 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదని, గత కొన్నేళ్లుగా ఈ ఫీజులు ఇలాగే ఉన్నాయని జడ్జి వీవీ పాటిల్ అన్నారు. కోర్టుకు పెద్దకేసులు వాదించడానికి వచ్చే లాయర్లకు ఒక్క సింగిల్ హియరింగ్‌కే కొన్ని లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తుంటే.. వీళ్లకు మరీ ఇంత తక్కువ ఇవ్వడం సరికాదని తెలిపారు. దోపిడీ కేసులో నిందితుడి తరఫున వాదించిన ఖుద్రత్ షేక్ అనే న్యాయవాదికి రూ. 10వేలను ప్రభుత్వం ఫీజుగా చెల్లించాలని సూచించారు. న్యాయవాదులు ఇంత కష్టపడి వాదిస్తుంటే వాళ్లకు 900 మాత్రమే ఇవ్వడం సరికాదని చెప్పారు.
సదరు న్యాయవాది కోర్టులో సెక్షన్ 304 కింద దాఖలు చేసిన దరఖాస్తు విచారణ అనంతరం జడ్జి పాటిల్ ప్రభుత్వానికి ఈ విధంగా తెలిపారు. ఉచిత న్యాయసలహా కేంద్రాల్లో ఇచ్చే ఫీజులు ఇంత తక్కువగా ఉంటాయి కాబట్టే న్యాయవాదులు చాలావరకు వీటికి దూరంగా ఉంటున్నారు. దాంతో అండర్ ట్రయల్ ఖైదీల విచారణలు ముందుకు సాగక.. వాళ్లు ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్నారు. దోపిడీ కేసులో దోషిగా తేలి, ఏడేళ్ల జైలుశిక్ష పడిన ఓ ఖైదీ తరఫున షేక్ వాదిస్తున్నారు. అయితే అతడి మీద ఉన్న మోకా కేసును కోర్టు కొట్టేసింది.