
పాకిస్థాన్‌పై బాంబు వేసి, ఆయన్ను విడిపించండి
జంషెడ్‌పూర్: విశ్వ హిందూ పరిషత్ ఫైర్ బ్రాండ్ ప్రవీణ్ తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై భారత్ బాంబు వేసి, ఆ దేశం మరణశిక్ష విధించిన మన నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను విడిపించాలని తొగాడియా అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చూసి భారత్ నేర్చుకోవాలని సూచించారు.
శుక్రవారం జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తొగాడియా మాట్లాడుతూ.. ట్రంప్‌ను ప్రశంసించారు. అఫ్ఘానిస్థాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై ట్రంప్ బాంబు వేయించారని చెప్పారు. గూఢచర్యం కేసులో పాక్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న జాదవ్‌ను విడిపించేందుకు భారత్ కూడా ఇలాంటి దాడి చేయాలని వ్యాఖ్యానించారు.
'వాషింగ్టన్‌కు 10 వేల కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న అఫ్ఘాన్‌లోని ఐఎస్ స్థావరాలపై అమెరికా బాంబు వేసింది. భారత ప‍్రభుత్వం కూడా పాకిస్థాన్‌పై బాంబు వేసి ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలి. న్యూఢిల్లీకి పాకిస్థాన్ కేవలం 800 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే భద్రత దళాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులనే ఏరివేయాలి. కశ్మీర్‌లో పౌరులకు, భద్రత దళాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించాలి' అని తొగాడియా అన్నారు.