రాష్ట్రపతి మా సలహా ఏమీ కోరలేదే!
న్యూఢిల్లీ: ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటు అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర హోంశాఖ సలహాను ఏమీ కోరలేదని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ రాష్ట్రపతికి సిఫారుసు చేసిన వార్తల నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. ఇప్పటివరకూ ఈ అంశానికి సంబంధించి రాష్ట్రపతి తమ సలహా ఏమీ కోరలేదన్నవిషయాన్ని గుర్తు చేశారు. 'ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ ప్రకటించాలి. అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ఏమీ చేయాలన్న ఆయన చెప్పేదాన్నే బట్టే ఆధారపడి ఉంటుంది' అని రాజ్ నాథ్ తెలిపారు.
ఇదిలా ఉండగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలంటూ ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ మభ్యపెట్టిందని ఆ పార్టీ విడుదల చేసిన వీడియో అంశంపై మాట్లాడటానికి రాజ్ నాథ్ తిరస్కరించారు. ఢిల్లీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ షెహర్ సింగ్ దగార్ ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియాకు డబ్బులు ఆశ చూపిందంటూ ఆ పార్టీ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.