సీమాంధ్ర ఎంపీల రాజీనామాల తిరస్కరణ | Lok Sabha Speaker rejects resignation of 13 Seemandhra MPs | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఎంపీల రాజీనామాల తిరస్కరణ

Published Sat, Oct 19 2013 1:48 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

సీమాంధ్ర ఎంపీల రాజీనామాల తిరస్కరణ - Sakshi

సీమాంధ్ర ఎంపీల రాజీనామాల తిరస్కరణ

సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా దాదాపు రెండు నెలల కిందట కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని.. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న రాజీనామా నిర్ణయాలను ఆమోదించటం సాధ్యం కాదని స్పీకర్ అభిప్రాయపడినట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3), లోక్‌సభ నియమావళిలోని 204 నిబంధనను అనుసరించి స్పీకర్ ఆయా ఎంపీల రాజీనామాలను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. తిరస్కరణకు గురైన రాజీనామాలలో కాంగ్రెస్‌కు చెందిన ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమర్పించిన రాజీనామాలున్నాయి.

రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడ్డాక గత ఆగస్టు 2-15 తేదీల మధ్య వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్‌ను కలిసి, మరికొందరు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాలను సమర్పించిన విషయం తెలిసిందే.

రాజీనామా చేసిన 13 మంది ఎంపీల్లో ఏడుగురు- ఉండవల్లి, లగడపాటి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి గత నెలాఖరులో స్వయంగా స్పీకర్ విచారణకు కూడా హాజరై రాజీనామాల్ని ఆమోదించాలని కోరిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన మిగిలిన ఆరుగురు సభ్యులను కూడా స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కోరినప్పటికీ గత కొద్ది రోజుల్లో టెలిఫోన్‌లో వారిని కూడా సంప్రదించిన తర్వాతే మొత్తం రాజీనామాలన్నింటినీ తిరస్కరించాలని స్పీకర్ నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

 ఏ కారణమూ చెప్పకపోతే ఆమోదించవచ్చు
గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యులు సమర్పించిన రాజీనామాలను కూడా ఇదే కారణంతో తిరస్కరించడం గమనార్హం. లోక్‌సభ సభ్యులెవరైనా తన సభ్యత్వాన్ని వదులుకోదలుచుకొన్నట్లు తెలియజేస్తూ తమ సొంత దస్తూరితో సమర్పించే రాజీనామా లేఖలో రాజీనామాకు ఎలాంటి కారణాలను పేర్కొనకుండా ఉంటేనే దానిని స్పీకర్ ఆమోదించవచ్చునని లోక్‌సభ నియమ, నిబంధనల్లోని 204 నిబంధన నిర్దేశిస్తోంది. రాజీనామా చేసిన సభ్యుడు స్వచ్ఛందంగా, ఎలాంటి ఇతరేతర కారణం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌కు స్వయంగా తెలియజేయాల్సి ఉంటుందని, అందుకు విరుద్ధమైన సమాచారమేదీ స్పీకర్ దృష్టికి రాకపోతే రాజీనామాను వెంటనే ఆమోదించవచ్చునని ఈ నిబంధన పేర్కొంటున్నది.

సభ్యుని రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై లోక్‌సభ తన సొంత మార్గాల్లో అవసరమైన సమాచారాన్ని సేకరించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3) కల్పిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వివిధ  సంఘాల నేతలు చేసిన ప్రకటనలు, పదవులు వదులుకోవాలని ఎంపీలపై ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారని లోక్‌సభ సచివాలయం తెలిపింది.
 
రెండు నెలల తర్వాత నిర్ణయం
దాదాపు రెండు నెలలుగా సీమాంధ్ర ఎంపీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానబెట్టిన స్పీకర్ మీరాకుమార్ ఇటీవలి కాలంలో రాజీనామాల ఆమోదానికి కొందరు చేస్తున్న ఒత్తిడికి తోడు తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ జరుగనుండటంతో శుక్రవారం తుదినిర్ణయం తీసుకుని రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యులందరికీ సమాచారం పంపించారని తెలిసింది. రాజీనామాలను తిరస్కరించినట్లు సంబంధిత సభ్యులకు తెలియజేసినందున స్పీకర్ నిర్ణయాన్ని పార్లమెంటరీ బులెటిన్‌లో ప్రచురించాల్సిన అవసరం ఉండదని, రాజీనామా ఆమోదం పొందిన సందర్భాలలోనే లోక్‌సభ సమాచార పత్రం (బులెటిన్)లో ప్రచురించి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో ప్రకటించాల్సి ఉంటుందని లోక్‌సభ సచివాలయ వర్గాలు స్పష్టంచేశాయి.
 
రాజీనామాల ఆమోదానికి కోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వం రాజీనామా ఆమోదం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. జగన్‌తో పాటు సహచర ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డిలు పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ తిరస్కరించటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

స్పీకర్ ఫార్మాట్‌లో వై.ఎస్.జగన్ పంపిన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి జగన్‌కు ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన ఎస్.పి.వై.రెడ్డిల రాజీనామాలను ఆమోదింపచేసుకునే దిశగా న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పేర్కొంది.
 
 మరోమారు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మాట్‌లో చేసిన తమ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించడం బాధాకరమని ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. తమ రాజీనామాలను తిరస్కరించిన ట్లు శుక్రవారం స్పీకర్ ప్రకటించిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో ఉద్యమం మొదలవడానికి ముందే తాము పదవులకు రాజీనామా చేశామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పీకర్‌ను కలిసి స్పష్టంగా విన్నవించినప్పటికీ.. ఆమె తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి రాజీనామాలను తిరస్కరించారని ఆయన చెప్పారు.

అయితే మరోమారు స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేస్తామని, అప్పటికీ ఆమోదించకుంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని, బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని సాయిప్రతాప్ స్పష్టం చేశారు. రాజీనామాలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో.. త్వరలో ఎంపీలమంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. విభజనవల్ల రాయలసీమకు సాగునీరు, ఉపాధి రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement