Sai Prathap
-
టీడీపీ తీర్థం పుచ్చుకున్న సాయి ప్రతాప్
హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి ఎ. సాయి ప్రతాప్ టీడీపీలో చేరారు. గురువారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఫాంహౌస్ లో ఆయన సమక్షంలో సాయి ప్రతాప్ టీడీపీలో చేరారు. ఆయన్ని టీడీపీలోకి పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. యూపీఏ హయాంలో సాయి ప్రతాప్ కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి ఆరు సార్లు ఎంపీగా సాయి ప్రతాప్ విజయం సాధించారు. అయితే గతే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.మిథున్ రెడ్డి చేతిలో సాయి ప్రతాప్ ఓటమి పాలైయ్యారు. -
కాంగ్రెస్‌లోకి ఇంకా కొంతమంది వస్తారు: బొత్స
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో మనస్తాపం చెంది పార్టీ నుంచి బయటికి వెళ్లిన నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని కోరుతున్నామని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. బయటికి వెళ్లినవారిలో తిరిగి వచ్చేందుకు ఇంకా కొందరు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు చెబుతామని పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో వార్‌రూం భేటీలో పాల్గొన్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న వారందరినీ తిరిగి పార్టీలోకి రావాలనికోరుతున్నాం. విభజనపై అందరికీ సెంటిమెంట్లు ఉన్నాయి. అందరం పోరాడాం. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌పార్టీ ఒక్కటే తప్పు చేయలేదు. అన్ని పార్టీలకు పాత్ర ఉంది. అందుకే సాయిప్రతాప్‌ను కూడా కోరడం జరిగింది. ఆయన తిరిగి రావడం సంతోషం. ఇంకా వచ్చేవాళ్లు ఉన్నారు. ఎవరెవరు వస్తారో త్వరలో చెబుతాం’’ అని బొత్స చెప్పారు. -
కిరణ్ కు సాయిప్రతాప్ షాక్
న్యూఢిల్లీ: కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు సాయి ప్రతాప్ మళ్లీ సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్‌ను సాయి ప్రతాప్ కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరింది. పార్టీలో చేరే విషయంపై సాయి ప్రతాప్ దిగ్విజయ్ సింగ్‌తో చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీలో సాయి ప్రతాప్ చేరారు. సాయి ప్రతాప్ సహా జై సమైక్యాంధ్రలో చేరిన పలువురు నాయకులు పార్టీని వీడుతు కిరణ్‌కు షాకిలుస్తున్నారు. -
బోల్తా
చివరి బంతి ఇంకా మిగిలే ఉందని సీమాంధ్రులను మభ్యపెట్టి.. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకూ పదవిని పట్టుకుని వేలాడి.. జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. ఎన్నికలు సమీపించే తరుణంలో తీరుబడిగా రాజీనామా చేసి పార్టీ ఏర్పాటు చేసిన కిరణ్తీరుపై ప్రజల్లోనే కాదు.. నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రవిభజనకు కిరణ్ పరోక్షంగా కేంద్రానికి పూర్తిగా సహకరించారని.. సీఎంగా ఉన్నప్పుడే కొత్తపార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారని మండిపడుతున్నారు.. పార్టీఆవిర్భావ సభకు జిల్లా నుంచి జనాలు వెళ్లలేదు.. ‘ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తాం జనాలను తీసుకురండి బాబూ..’ అని కిరణ్‌వర్గం చెబుతున్నా ఎంపీ సాయిప్రతాప్, తులసిరెడ్డి మినహా మరో నేత ఎవరూ కిరణ్వెంట నడవలేదు. సాక్షి, కడప: కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఆవిర్భావ సభను బుధవారం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సభకు జిల్లా నుంచి రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, తులసిరెడ్డి మినహా తక్కిన నేతలెవ్వరూ హాజరుకాలేదు. సభకు జనాలు రారని ముందే పసిగట్టిన కిరణ్‌వర్గం అన్ని జిల్లాలలోని పలువురు ద్వితీయశ్రేణి నేతలకు ఫోన్లు చేసి ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశచూపింది. ‘రాజమండ్రిసభకు జనాలను తీసుకురావాలని, మీ నియోజకవర్గంలో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీని నడిపించే చొరవ తీసుకుంటే చాలు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తామ’ని కిరణ్ సోదరుడు సంతోష్‌రెడ్డితో పాటు ఎంపీ సబ్బంహరి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వయంగా ఫోన్లు చేసి బతిమలాడారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, కడపలోని కాంగ్రెస్‌పార్టీకి చెందిన పలువురు ద్వితీయశ్రేణి నేతలకు ఫోన్లు చేసి ఈ విధంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పట్టుమని పదిమంది కూడా ‘రాజమండ్రి’ రెలైక్కలేదు. కాంగ్రెస్‌పార్టీని వీడిన కొందరు సీనియర్ నేతలు కూడా అవసరమైతే మరోపార్టీలో చేరతాం తప్ప...కిరణ్‌పార్టీలోకి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి కిరణ్‌వర్గం ఆహ్వానం పంపితే ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని కూడా లగడపాటి, సబ్బం హరిపార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. ‘అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ కిరణ్‌పార్టీలోకి రాను’ అని డీఎల్ చెప్పినట్లు తెలిసింది. రాయచోటికి చెందిన కాంగ్రెస్‌పార్టీ యువనేతతో సంప్రదింపులు జరిపితే ‘డిపాజిట్లు కూడా రానిపార్టీ తరుఫున పోటీ చేయడం కంటే ఉరుకోవడం మంచిది’ అని అనుచరులతో చెప్పినట్లు సమాచారం. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మను కూడా పార్టీలోకి రావాలని కిరణ్ ఫోన్‌చేస్తే ‘ఆలోచించి చెబుతా!’ అని బదులిచ్చినట్లు తెలిసింది. తర్వాత ఫోన్ చేస్తే లిప్ట్ చేయడమే మానేసిందని బద్వేలు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇలా ఏ ఒక్క నేత, కార్యకర్త కిరణ్‌పార్టీలోకి వెళ్లాలని ఆలోచించడం లేదు. ఈ పరిణామాలన్నీ బేరీజు వస్తే వైఎస్సార్‌జిల్లాలో కిరణ్‌పార్టీ ప్రభావం ఏ మాత్రం ఉండదనేది సుస్పష్టమవుతోంది. ఆ ఇద్దరు ఉన్నా ఫలితం సున్నా కిరణ్జట్టులో సాయిప్రతాప్, తులసిరెడ్డి ఉన్నా వారికి అనుచరగణం లేదనేది బహిరంగ రహస్యం. సాయిప్రతాప్ స్వయం ప్రకాశితం కాదని... వైఎస్ అనే కాంతివల్ల ఇన్నిరోజులు రాజకీయాల్లో ప్రకాశించారని, సొంతంగా ఓ మోస్తారు కేడర్ కూడా లేదనే విషయం తెలిసిందే! ‘మైకువీరుడు’గా పేరుపొందిన తులసిరెడ్డి వెంటనడిచేందుకు పదిమంది జనాలు కూడా లేరని అలాంటి వారు ఏ పార్టీలోకి వెళ్లినా, మరో పార్టీకి వచ్చేనష్టం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ మినహా తక్కిన ఏనేత కొత్తపార్టీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. అశోక్‌బాబుపై మండిపడుతున్న ఉద్యోగులు ఏపీ ఎన్జీవోసంఘం అధ్యక్షుడు అశోక్బాబుతీరుపై కొందరు ఎన్జీవో నేతలు మండిపడుతున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్లు నటించిన అశోక్‌బాబు కిరణ్‌పార్టీ ప్రచారానికి ప్రత్యక్షంగా సహకరించారని ఆరోపిస్తున్నారు. కిరణ్‌పార్టీ జెండా, టోపీలు, ఫ్లెక్సీలను ఢిల్లీలో చేసిన రెండురోజుల దీక్షలోపాల్గొన్నవారికి అమర్చి ఉద్యోగులకు ‘టోపీ’ పెట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. -
సీమాంధ్ర ఎంపీల రాజీనామాల తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా దాదాపు రెండు నెలల కిందట కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని.. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న రాజీనామా నిర్ణయాలను ఆమోదించటం సాధ్యం కాదని స్పీకర్ అభిప్రాయపడినట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3), లోక్‌సభ నియమావళిలోని 204 నిబంధనను అనుసరించి స్పీకర్ ఆయా ఎంపీల రాజీనామాలను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. తిరస్కరణకు గురైన రాజీనామాలలో కాంగ్రెస్‌కు చెందిన ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమర్పించిన రాజీనామాలున్నాయి. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడ్డాక గత ఆగస్టు 2-15 తేదీల మధ్య వీరిలో కొంతమంది స్వయంగా స్పీకర్‌ను కలిసి, మరికొందరు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాలను సమర్పించిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన 13 మంది ఎంపీల్లో ఏడుగురు- ఉండవల్లి, లగడపాటి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి గత నెలాఖరులో స్వయంగా స్పీకర్ విచారణకు కూడా హాజరై రాజీనామాల్ని ఆమోదించాలని కోరిన విషయం తెలిసిందే. రాజీనామా చేసిన మిగిలిన ఆరుగురు సభ్యులను కూడా స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కోరినప్పటికీ గత కొద్ది రోజుల్లో టెలిఫోన్లో వారిని కూడా సంప్రదించిన తర్వాతే మొత్తం రాజీనామాలన్నింటినీ తిరస్కరించాలని స్పీకర్ నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏ కారణమూ చెప్పకపోతే ఆమోదించవచ్చు గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు సమర్పించిన రాజీనామాలను కూడా ఇదే కారణంతో తిరస్కరించడం గమనార్హం. లోక్‌సభ సభ్యులెవరైనా తన సభ్యత్వాన్ని వదులుకోదలుచుకొన్నట్లు తెలియజేస్తూ తమ సొంత దస్తూరితో సమర్పించే రాజీనామా లేఖలో రాజీనామాకు ఎలాంటి కారణాలను పేర్కొనకుండా ఉంటేనే దానిని స్పీకర్ ఆమోదించవచ్చునని లోక్‌సభ నియమ, నిబంధనల్లోని 204 నిబంధన నిర్దేశిస్తోంది. రాజీనామా చేసిన సభ్యుడు స్వచ్ఛందంగా, ఎలాంటి ఇతరేతర కారణం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌కు స్వయంగా తెలియజేయాల్సి ఉంటుందని, అందుకు విరుద్ధమైన సమాచారమేదీ స్పీకర్ దృష్టికి రాకపోతే రాజీనామాను వెంటనే ఆమోదించవచ్చునని ఈ నిబంధన పేర్కొంటున్నది. సభ్యుని రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై లోక్‌సభ తన సొంత మార్గాల్లో అవసరమైన సమాచారాన్ని సేకరించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3) కల్పిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వివిధ సంఘాల నేతలు చేసిన ప్రకటనలు, పదవులు వదులుకోవాలని ఎంపీలపై ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారని లోక్‌సభ సచివాలయం తెలిపింది. రెండు నెలల తర్వాత నిర్ణయం దాదాపు రెండు నెలలుగా సీమాంధ్ర ఎంపీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానబెట్టిన స్పీకర్ మీరాకుమార్ ఇటీవలి కాలంలో రాజీనామాల ఆమోదానికి కొందరు చేస్తున్న ఒత్తిడికి తోడు తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ జరుగనుండటంతో శుక్రవారం తుదినిర్ణయం తీసుకుని రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యులందరికీ సమాచారం పంపించారని తెలిసింది. రాజీనామాలను తిరస్కరించినట్లు సంబంధిత సభ్యులకు తెలియజేసినందున స్పీకర్ నిర్ణయాన్ని పార్లమెంటరీ బులెటిన్‌లో ప్రచురించాల్సిన అవసరం ఉండదని, రాజీనామా ఆమోదం పొందిన సందర్భాలలోనే లోక్‌సభ సమాచార పత్రం (బులెటిన్)లో ప్రచురించి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో ప్రకటించాల్సి ఉంటుందని లోక్‌సభ సచివాలయ వర్గాలు స్పష్టంచేశాయి. రాజీనామాల ఆమోదానికి కోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్సార్ సీపీ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వం రాజీనామా ఆమోదం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. జగన్‌తో పాటు సహచర ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డిలు పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ తిరస్కరించటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. స్పీకర్ ఫార్మాట్లో వై.ఎస్.జగన్ పంపిన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి జగన్‌కు ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డితో పాటు, పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన ఎస్.పి.వై.రెడ్డిల రాజీనామాలను ఆమోదింపచేసుకునే దిశగా న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పేర్కొంది. మరోమారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మాట్లో చేసిన తమ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించడం బాధాకరమని ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. తమ రాజీనామాలను తిరస్కరించిన ట్లు శుక్రవారం స్పీకర్ ప్రకటించిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో ఉద్యమం మొదలవడానికి ముందే తాము పదవులకు రాజీనామా చేశామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పీకర్‌ను కలిసి స్పష్టంగా విన్నవించినప్పటికీ.. ఆమె తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి రాజీనామాలను తిరస్కరించారని ఆయన చెప్పారు. అయితే మరోమారు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేస్తామని, అప్పటికీ ఆమోదించకుంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని, బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని సాయిప్రతాప్ స్పష్టం చేశారు. రాజీనామాలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో.. త్వరలో ఎంపీలమంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. విభజనవల్ల రాయలసీమకు సాగునీరు, ఉపాధి రంగాల్లో తీరని అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
ప్రభుత్వాన్ని కూల్చం: సాయిప్రతాప్
న్యూఢిల్లీ: తమ రాజీనామాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పడిపోదని రాజంపేట కాంగ్రెస్ ఎంపీ సాయిప్రతాప్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదన్నారు. తన రాజీనామా ఆమోదం కోసం ఆయన నేడు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కార్యాలయానికి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా సాయిప్రతాప్ మాట్లాడుతూ రాజీనామా ఆమోదం కోసం స్పీకర్‌ను కలవాలని వచ్చినట్టు తెలిపారు. రాజీనామా ఆమోదంపై కోర్టుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదన్నారు. స్పీకర్ అపాయింట్మెంట్ కోరామన్నారు. రాజీనామాల ఆమోదం కోసం ఉండవల్లి, లగడపాటి, అనంత, తాను ఒత్తిడి చేస్తున్నామని చెప్పారు. సమైక్యవాద పార్టీల నాయకులను తమ పార్టీ నేతలు కలిస్తే తప్పేందని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా స్పీకర్ కార్యాలయానికి వచ్చారు. స్పీకర్ లేకపోవడంతో అక్కడి నుంచి ఆయన వెనుదిరిగారు.