చివరి బంతి ఇంకా మిగిలే ఉందని సీమాంధ్రులను మభ్యపెట్టి.. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకూ పదవిని పట్టుకుని వేలాడి.. జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. ఎన్నికలు సమీపించే తరుణంలో తీరుబడిగా రాజీనామా చేసి పార్టీ ఏర్పాటు చేసిన కిరణ్‌తీరుపై ప్రజల్లోనే కాదు.. నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రాష్ట్రవిభజనకు కిరణ్ పరోక్షంగా కేంద్రానికి పూర్తిగా సహకరించారని.. సీఎంగా ఉన్నప్పుడే కొత్తపార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారని మండిపడుతున్నారు.. పార్టీఆవిర్భావ సభకు జిల్లా నుంచి జనాలు వెళ్లలేదు.. ‘ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తాం జనాలను తీసుకురండి బాబూ..’ అని కిరణ్‌వర్గం
చెబుతున్నా ఎంపీ సాయిప్రతాప్, తులసిరెడ్డి మినహా మరో నేత ఎవరూ కిరణ్‌వెంట నడవలేదు.
సాక్షి, కడప: కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఆవిర్భావ సభను బుధవారం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సభకు జిల్లా నుంచి రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, తులసిరెడ్డి మినహా తక్కిన నేతలెవ్వరూ హాజరుకాలేదు. సభకు జనాలు రారని ముందే పసిగట్టిన కిరణ్‌వర్గం అన్ని జిల్లాలలోని పలువురు ద్వితీయశ్రేణి నేతలకు ఫోన్లు చేసి ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశచూపింది. ‘రాజమండ్రిసభకు జనాలను తీసుకురావాలని, మీ నియోజకవర్గంలో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీని నడిపించే చొరవ తీసుకుంటే చాలు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తామ’ని కిరణ్ సోదరుడు సంతోష్‌రెడ్డితో పాటు ఎంపీ సబ్బంహరి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వయంగా ఫోన్లు చేసి బతిమలాడారు.
జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, కడపలోని కాంగ్రెస్‌పార్టీకి చెందిన పలువురు ద్వితీయశ్రేణి నేతలకు ఫోన్లు చేసి ఈ విధంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పట్టుమని పదిమంది కూడా ‘రాజమండ్రి’ రెలైక్కలేదు. కాంగ్రెస్‌పార్టీని వీడిన కొందరు సీనియర్ నేతలు కూడా అవసరమైతే మరోపార్టీలో చేరతాం తప్ప...కిరణ్‌పార్టీలోకి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి కిరణ్‌వర్గం ఆహ్వానం పంపితే ఆయన తిరస్కరించినట్లు తెలిసింది.
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని కూడా లగడపాటి, సబ్బం హరిపార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. ‘అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ కిరణ్‌పార్టీలోకి రాను’ అని డీఎల్ చెప్పినట్లు తెలిసింది. రాయచోటికి చెందిన కాంగ్రెస్‌పార్టీ యువనేతతో సంప్రదింపులు జరిపితే ‘డిపాజిట్లు కూడా రానిపార్టీ తరుఫున పోటీ చేయడం కంటే ఉరుకోవడం మంచిది’ అని అనుచరులతో చెప్పినట్లు సమాచారం. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మను కూడా పార్టీలోకి రావాలని కిరణ్ ఫోన్‌చేస్తే ‘ఆలోచించి చెబుతా!’ అని బదులిచ్చినట్లు తెలిసింది. తర్వాత ఫోన్ చేస్తే లిప్ట్ చేయడమే మానేసిందని బద్వేలు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇలా ఏ ఒక్క నేత, కార్యకర్త కిరణ్‌పార్టీలోకి వెళ్లాలని ఆలోచించడం లేదు. ఈ పరిణామాలన్నీ బేరీజు వస్తే వైఎస్సార్‌జిల్లాలో కిరణ్‌పార్టీ ప్రభావం ఏ మాత్రం ఉండదనేది సుస్పష్టమవుతోంది.
ఆ ఇద్దరు ఉన్నా ఫలితం సున్నా
కిరణ్‌జట్టులో సాయిప్రతాప్, తులసిరెడ్డి ఉన్నా వారికి అనుచరగణం లేదనేది బహిరంగ రహస్యం. సాయిప్రతాప్ స్వయం ప్రకాశితం కాదని... వైఎస్ అనే కాంతివల్ల ఇన్నిరోజులు రాజకీయాల్లో ప్రకాశించారని, సొంతంగా ఓ మోస్తారు కేడర్ కూడా లేదనే విషయం తెలిసిందే! ‘మైకువీరుడు’గా పేరుపొందిన తులసిరెడ్డి వెంటనడిచేందుకు పదిమంది జనాలు కూడా లేరని అలాంటి వారు ఏ పార్టీలోకి వెళ్లినా, మరో పార్టీకి వచ్చేనష్టం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ మినహా తక్కిన ఏనేత కొత్తపార్టీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు.
అశోక్‌బాబుపై మండిపడుతున్న ఉద్యోగులు
ఏపీ ఎన్జీవోసంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుతీరుపై కొందరు ఎన్జీవో నేతలు మండిపడుతున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్లు నటించిన అశోక్‌బాబు కిరణ్‌పార్టీ ప్రచారానికి ప్రత్యక్షంగా సహకరించారని ఆరోపిస్తున్నారు. కిరణ్‌పార్టీ జెండా, టోపీలు, ఫ్లెక్సీలను ఢిల్లీలో చేసిన రెండురోజుల దీక్షలోపాల్గొన్నవారికి అమర్చి ఉద్యోగులకు ‘టోపీ’ పెట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.
బోల్తా
Published Thu, Mar 13 2014 2:31 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement