పెట్టుబడుల్లో ముఖ్యంగా దీర్ఘకాలిక దృష్టితో చేసే ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో వైవిధ్యం చూపడం అనేది చాలా కీలకమైన విషయం. ఒకే రంగానికి చెందిన వాటిల్లో పెట్టుబడి పెట్టకుండా ఈ మొత్తాన్ని విభిన్న రంగాలకు మళ్లించడం ద్వారా సాధ్యమైనంత వరకు నష్టభయాన్ని తగ్గించుకోవడమే కాకుండా లాభాలను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. పెట్టుబడుల్లో వైవిధ్యత చూపడం వల్ల నష్టాలు పూర్తిగా ఉండవని కాదు, కాని దీనివల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు.
పెట్టుబడుల్లో వైవిధ్యం ఎందుకు ఉండాలో ఇప్పుడు సోదాహరణంగా తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు ఎయిర్‌లైన్స్ షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒకరోజు హఠాత్తుగా పైలట్లు సమ్మెకి దిగితే ఎయిర్‌లైన్స్ షేర్లన్నీ కుప్పకూలుతాయి. అప్పుడు తీవ్ర నష్టాలు తప్పవు. అదే ఎయిర్‌లైన్స్‌తోపాటు రైల్వే వంటి ఇతర రవాణా రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వైవిధ్యత చూపిస్తే, ఈ నష్టం సాధ్యమైనంత వరకు తగ్గిపోతుంది. ఎందుకంటారా.. పైలట్ల సమ్మెతో విమానాలు నిలిచి పోతే ప్రత్యామ్నాయ రవాణా మార్గాలైన రైల్వేలను ప్రయాణికులు ఆశ్రయిస్తారు.
దాంతో వాటి ఆదాయం పెరిగి ఆ షేర్లు పెరుగుతాయి. అప్పడు ఎయిర్‌లైన్స్ షేర్ల వల్ల వచ్చిన నష్టాలను రైల్వే షేర్లతో పూడ్చుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేడప్పుడు రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీ, బులియన్, రియల్ ఎస్టేట్, డెట్ వంటి అన్ని పథకాలకూ విస్తరించాలి. ఇవి కాకుండా అసలు రిస్క్ లేని గవర్నమెంట్ సెక్యూరిటీలు, పోస్టాఫీసు, రికరింగ్ డిపాజిట్లు వంటి వాటిల్లో కూడా కొంతమేర కేటాయించే విధంగా చూసుకోండి.
రిస్క్ తక్కువ ఉన్న సాధనాలకు ఎక్కువ కేటాయిస్తే ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉన్న పథకాలకు కేటాయిస్తూ వెవిధ్యం చూపించాలి. అప్పుడే రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు స్థిరమైన సంపదను సృష్టించుకునే వెసులుబాటు కలుగుతుంది.