
ప్రతి ఫ్యామిలీని టచ్ చేస్తుంది: చిరంజీవి
చెన్నై : ప్రేమాభిమానాల కలయికతో రూపొందిన పురస్కారం 'గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు' అని ప్రముఖ నటుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. అందుకే ఈ పురస్కారం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారని ఆయన వివరించారు.
చెన్నైలో బుధవారం జరిగిన గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు ప్రదానోత్సవంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సినిమా అవార్డుల పురస్కార ప్రదానాలను... నిర్వహకులు స్కూల్లో జరిగే అవార్డుల ఫంక్షన్లుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గొల్లపూడి శ్రీనివాస్ పురస్కారం ప్రదానోత్సవం అలా కాదని... ఈ కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసే విధంగా ఉంటుందన్నారు.
2014 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని హిందీ నాటకం 'క్యూ' రూపొందించిన సంజీవ్ గుప్తాకు ఈ అవార్డుతోపాటు రూ. 1,50, 000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ హాజరయ్యారు. అలాగే ప్రముఖ హీరో సిద్ధార్ధ్, తమిళ నిర్మాత కార్తీక్ సుబ్బరాజులు విచ్చేశారు.
దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి మరణించిన విషయం తెలిసిందే. దాంతో గొల్లపూడి శ్రీనివాస్ పేరిట ఆయన తండ్రి ప్రముఖ నటుడు, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు 1998లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.