లవ్ యూ డాడీ.. మిస్ యూ అన్నయ్యా..
వాట్సాప్‌లో రిషితేశ్వరి చివరి మేసేజ్‌లు
సాక్షి, గుంటూరు: లవ్ యూ డాడీ.. మిస్ యూ అన్నయ్యా.. ఇవి రిషితేశ్వరి ఫోన్ నుంచి వెళ్లిన చివరి మేసేజ్‌లు. తరువాత ఫోనుతోపాటు ఆమె గొంతు కూడా మూగబోయింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటాపై దృష్టి సారించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 14వ తేదీ ఆమె చనిపోయిన సమయం వరకు ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఆమెకు ఎవరెవరు ఫోన్లు చేశారు అనే వివరాలను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా అనుమానితులను పిలిచి విచారిస్తున్నారు. రిషితేశ్వరి జూలై 13న తల్లిదండ్రులతో, అన్నయ్య అని పిలిచే జితేంద్రతో మాత్రమే మాట్లాడింది. జితేంద్రకు మాత్రం అనేకసార్లు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడినట్లు తేలింది.
జూలై 13వ తేదీ రాత్రి సినిమా హాల్ నుంచి కూడా ఆమె జితేంద్రతో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హాల్ బయటకు వచ్చిన రిషితేశ్వరి తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లుగా కాల్ డేటాలో స్పష్టమైంది. తరువాత హాస్టల్‌కు చేరాక కూడా పలుమార్లు జితేంద్రతో ఫోన్‌లో మాట్లాడినట్లు తేలింది. ఘటన జరిగిన రోజు జూలై 14వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆమె తల్లిదండ్రులు, జితేంద్రతో తప్ప ఎవరికి ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఎవరూ చేయలేదు. చివరగా మధ్యాహ్నం 12.28 గంటలకు వాట్సాప్ ద్వారా తండ్రికి, జితేంద్రకు ఒకేసారి మెసేజ్‌లు చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు పలుమార్లు జితేంద్రను విచారించినప్పటికీ ఎటువంటి కొత్త ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం.
ఏపీ సీఎంకు కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణకు నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు అందచేసింది. ఈ విషయాన్ని సీఎం తనను కలిసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలిపారు. మంత్రి గంటా, కమిటీ ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఆదివారం ఈ నివేదికలోని ముఖ్యాంశాలను మీడియాకు వెల్లడించనున్నారు.