మంటపెట్టారు | LPG price hiked | Sakshi
Sakshi News home page

మంటపెట్టారు

Published Thu, Jan 2 2014 2:28 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

మంటపెట్టారు - Sakshi

మంటపెట్టారు

కేంద్రం కొత్త సంవత్సర ‘కానుక’.. వంటగ్యాస్ ధర పెంపు
రూ. 215 పెరిగిన సబ్సిడీయేతర సిలిండర్ ధర..
రూ. 11.00 హైదరాబాద్‌లో పెరిగిన సబ్సిడీ సిలిండర్ ధర


 సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్:
కొత్త సంవత్సర ఆరంభం రోజే కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.215 మేరకు పెంచేసింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.1112.50 ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.1327.50కు ఎగబాకింది. ఈ పెంపుతో సబ్సిడీ సిలిండర్ ధర కూడా రూ. 11 పెరిగింది. ఈ నెల 1 నుంచే పెరిగిన ధర అమల్లోకి వచ్చింది. వంటగ్యాస్ ధర ఒకేసారి రూ.200కు పైగా పెరగడంపై ప్రజలు, రాజకీయ పక్షాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలను సాకుగా చూపుతూ చమురు కంపెనీలు వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

తాజా పెరుగుదలతో కలిపి గత నెల రోజుల్లోనే వంటగ్యాస్ ధర మూడుసార్లు పెరగడం గమనార్హం. గత డిసెంబర్ 1న, అదే నెల 11న కూడా గ్యాస్ ధరలు పెరిగారుు. కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ అమల్లోకి తెచ్చిన తర్వాత సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర భారీగా పెరిగింది. గత జూన్‌లో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.965 ఉండేది. అప్పట్లో వినియోగదారులకు 412.50 సబ్సిడీ ధరతో గ్యాస్ లభించేది. సబ్సిడీపై అందజేసే సిలిండర్ల సంఖ్యపైనా పరిమితి ఉండేది కాదు. అరుుతే జూన్ నుంచి నగదు బదిలీ పథకం అమలు చేయడంతో పాటు ఏడాదికి 9 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే  ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ (కేవలం ఆరు నెలల్లోనే) సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.362 పెరగడం గమనార్హం. తొమ్మిది సిలిండర్ల పరిమితిని దాటి గ్యాస్‌ను వినిగియోగించేవారిపైనా, నగదు బదిలీ పథకం అమలవుతున్న జిల్లాల్లో ఆధార్ అనుసంధానం చేసుకోని సబ్సిడీ వర్తించని వినియోగదారులపైనా ఎప్పటికప్పుడు మోయలేని భారం పడుతోంది. చమురు కంపెనీలు  ప్రతి నెలా మొదటి తారీఖున సబ్సిడీయేతర ఎల్పీజీ ధరలను సవరిస్తున్నారుు.

 సబ్సిడీగ్యాస్ వారిపై రూ.11.50 అదనపు భారం

  సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ధర పెరగడం వల్ల సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులపై కూడా అదనపు భారం పడుతోంది. తాజా పెంపునకు ముందు రాష్ట్ర రాజధానిలో (రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ధరలో స్వల్ప తేడా ఉంటుంది) 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1112.50 ఉండగా ఇందులో నగదు బదిలీ కింద (సబ్సిడీ) రూ.641 వినియోగదారుల అకౌంట్లలో జమ అవుతోంది. దీంతో గరిష్టంగా ప్రజలకు సిలిండర్ ధర రూ.471.50 పడేది. బుధవారం నుంచి వంటగ్యాస్ ధర రూ.1327.50కు పెరిగింది. వినియోగదారులు 1327.50 చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే నగదు బదిలీ కింద ప్రభుత్వం రూ.845 వారి బ్యాంకు అకౌంట్లలో సబ్సిడీ కింద జమ చేస్తుంది. సబ్సిడీ మొత్తం పోనూ వినియోగదారులకు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.482.50 పడుతుంది. అంటే సబ్సిడీ సిలిండర్లు కొనుగోలు చేసేవారిపై కూడా ఒక్కో దానికీ రూ.11.50 అదనపు భారం పడుతున్నట్లే.

 తొమ్మిది సిలిండర్లు దాటినా, సబ్సిడీ వర్తించకున్నా మోతే..

 ఏడాదికి తొమ్మిది సిలిండర్లకు మాత్రమే నగదు బదిలీ కింద సబ్సిడీ వర్తిస్తుంది. పదో సిలిండర్ కావాలంటే రూ.1327.50 చెల్లించాల్సిందే. అంటే బ్యాంకులో ఎలాంటి మొత్తం జమ కాదు. మరోవైపు నగదు బదిలీ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన జిల్లాల్లో ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) నమోదు చేసుకోని, ఆధార్‌తో బ్యాంకు అకౌంటును అనుసంధానం చేసుకోని వినియోగదారులంతా ప్రతి ఒక్క సిలిండర్‌ను (తొలి తొమ్మిది సిలిండర్లను కూడా) సబ్సిడీయేతర ధర అంటే రూ.1327.50 చెల్లించి కొనుగోలు చేయక తప్పడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 28.29 లక్షల మందికి వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా 19.26 లక్షల మందికి మాత్రమే ఆధార్, బ్యాంకు అకౌంట్లు అనుసంధానం అయ్యాయి. మిగిలిన 9.03 లక్షల మంది వినియోగదారులకు నగదు బదిలీ కింద సబ్సిడీ వర్తించడంలేదు. దీంతో వీరంతా అన్నీ సబ్సిడీ రహిత సిలిండర్లనే కొనాల్సి వస్తోంది. ప్రస్తుతం వీరికి సిలిండర్ ధర రూ.1327.50 పడుతోంది. ఆధార్ లేదనే కారణంగా సబ్సిడీని, ప్రభుత్వ పథకాల అమలును నిలిపివేయరాదంటూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయక పోవడం గమనార్హం.

 రాష్ట్ర ప్రభుత్వం దొంగదెబ్బలు

  కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సందట్లో సడేమియూలా గ్యాస్ వినియోగదారులను దొంగదెబ్బ తీసింది. సిలిండర్‌పై వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.25 సబ్సిడీని నగదు బదిలీ పథకం అమలవుతున్న జిల్లాల్లో ఎత్తివేసింది. అంటే ఈ జిల్లాల్లో ప్రజలపై ఒక్కో సిలిండర్‌కు రూ.25 అదనపు భారం పడింది. ఇది చాలదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీయేతర వంటగ్యాస్ బిల్లుపై 5% వ్యాట్‌ను విధిస్తోంది. సబ్సిడీ బిల్లు (వినియోగదారులు చెల్లించే మొత్తం)పై కాకుండా మార్కెట్ ధరపై వ్యాట్ విధించడం వల్ల రూ.41 అదనపు భారం పడుతోంది. అంటే నగదు బదిలీ అమల్లో లేని జిల్లాలతో పోల్చితే ఈ పథకం అమల్లో ఉన్న జిల్లాల ప్రజలపై ఒక్కో సిలిండర్‌కు రూ.66 అదనపు భారం పడుతోంది. తాజాగా నగదు బదిలీ పూర్తిస్థారుులో అమల్లోలేని జిల్లాల్లో కూడా రూ.25 సబ్సిడీని ప్రభుత్వం రద్దు చేసింది.


 19 కిలోల సిలిండర్‌పై రూ.385.50 అదనపు భారం

 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1882.50 నుంచి రూ.2268కు పెరిగింది. దీంతో 19 కిలోల సిలిండర్ కొనుగోలుదారులపై రూ.385.50 అదనపు భారం పడుతోంది. హోటళ్లు, మిఠాయి దుకాణాలు లాంటి అన్ని వ్యాపార సంస్థలపై ఈ పెంపు ప్రభావం తప్పదు. వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ ధర పెరిగినందున వ్యాపారులు తిరిగి ఈ భారాన్ని ప్రజలపైనే వేస్తారు. అంటే అంతిమంగా ఈ పెంపు ప్రభావం కూడా ప్రజలపైనే పడనుంది.

 ఆధార్ గడువు పెంపు

 రెండో దశలో ఆధార్ అనుసంధానానికి సంబంధించిన గడువును కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ నెలాఖరు వరకు పొడిగించింది. వాస్తవంగా ఈ జిల్లాల్లో నగదు బదిలీకి ఆధార్ గడువు డిసెంబర్ 31తో ముగిసింది. అరుుతే ఆధార్ ప్రక్రియ పూర్తికావడంలో సమస్యలు దృష్టిలో పెట్టుకుని గడువును పొడిగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  సబ్సిడీతో ఆదుకున్న వైఎస్

 2003లో సిలిండర్ ధర రూ.305.88 ఉండేది. 2008 జూన్‌లో కేంద్రం ఈ ధరను రూ.355.88కి పెంచింది. రాష్ట్ర ప్రజలపై ఒక్కసారిగా పడిన రూ.50 అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.370 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు చెప్పినా.. పేదలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ధ్యేయంగా వైఎస్ నిర్ణయం తీసుకుని అమలు చేశారు. దీంతో రాష్ట్ర వినియోగదారులకు పాత ధర (రూ.305.88)కే సిలిండర్ అందుబాటులో ఉంది. అనంతరం తీవ్రమైన ప్రజావ్యతిరేకత కారణంగా కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.25 తగ్గించి రూ.330.88గా ఖరారు చేసింది. దీంతో వైఎస్ పాత నిర్ణయాన్ని అమలు చేస్తూ మిగతా రూ.25ను సబ్సిడీగా కొనసాగించారు. దీంతో 2003లో ఉన్న ధరకే సిలిండర్ అందుబాటులో ఉండింది. అరుుతే క్రమేణా కేంద్రం ధర  పెంచుతూ పోతుండడంతో ప్రస్తుతం సిలిండర్ ధర గణనీయంగా పెరిగింది. తాజాగా ఈ రూ.25 సబ్సిడీని కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎత్తివేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement