'అదృష్టవంతురాలిని నన్ను రేప్ చేయలేదు'
హరియాణ బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కొడుకు వికాస్ చేతిలో వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు తాజాగా తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. తాను సామాన్యుడి బిడ్డను అయితే ఈ కేసును ఇంత సీరియస్‌గా తీసుకొని ఉండేవారు కాదేమోనని ఆమె తెలిపారు. ఐఏఎస్ అధికారి కూతురు అయిన ఆమె గత శుక్రవారం రాత్రి తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరించారు.
'ఆ రాత్రి నేను ఎంతో భయపడ్డాను. నా చేతులు వణికాయి. భయంతో వెన్ను జలదరించింది. ఒకవైపు విస్మయం.. ఇంకోవైపు కళ్లలో నీళ్లు.. నేను ఈ రోజు ఇంటికి వెళుతానా? లేదో తెలియని భయం. పోలీసులు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలుసు' అంటూ ఆమె వివరించారు. 'గతరాత్రి చండీగఢ్ రోడ్డుమీద దాదాపు కిడ్నాప్ అయ్యేదాన్ని' అంటూ ఆమె శనివారం పెట్టిన పోస్టును ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంతోమంది ఈ పోస్టును షేర్ చేసుకుంటున్నారు.
'సామ్యానుడి కూతురిని కాకపోవడం నా అదృష్టమేమో.. ఎందుకంటే, అలాంటి వీఐపీలను సామాన్యులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? నాపై రేప్, హత్య వంటి దుర్మార్గాలు జరగకపోవడం కూడా నా అదృష్టమే అనుకుంటున్నా' అని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే బలమైన రాజకీయ ప్రాబల్యమున్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు వెంటాడి వేధించారని ఆమె తెలిపారు.
ఆమెను నడిరోడ్డుపై వెంటాడి వేధించిన కేసులో బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలాతోపాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లో శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్‌యూవీ వాహనంలో వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలంలోనే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఇద్దరు నిందితుల్ని బెయిల్‌పై విడుదల చేశారు. రాజకీయ ప్రాబల్యమున్న కుటుంబానికి చెందిన నిందితులపై పోలీసులు కిడ్నాప్ అభియోగాలు నమోదుచేయకపోవడంతో హరియాణలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.