Vikas Barala
-
వేధింపుల కేసు: బీజేపీ చీఫ్ కుమారుడికి బెయిల్
సాక్షి, చండీగఢ్: యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాకు బెయిల్ మంజూరైంది. గతంలో కింది కోర్టులో నాలుగుసార్లు వికాస్ బెయిల్ పిటీషన్ కొట్టివేయగా, ఐదోప్రయత్నంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా ఎట్టకేలకు బెయిల్ లభించింది. యువతి కారు అడ్డగింత, వేధింపులు, కిడ్నాప్ యత్నం కేసులో గతేడాది ఆగస్టు 9న వికాస్‌ను, అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు బాధితురాలు వర్ణికా కుందును బరాలా కౌన్సిల్ దాదాపు ఐదు గంటలపాటు కొన్ని వందల ప్రశ్నలు అడిగారు. అనంతరం రెండు రోజులకు గురువారం నిందితుడు వికాస్ బరాలకు పంజాబ్, హర్యానాల ఉమ్మడి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది ఆగస్టు 4న చండీగఢ్‌లోని సెక్టార్ 8లో వర్ణికా కుందు తన కారులో వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు ఆశిష్‌తో కలిసి తమ ఎస్యూవీ వాహనంతో 8 కిలోమీటర్లు ఫాలో అవుతూ వెంబడించి వేధించారు. పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయగా వారు అక్కడికి చేరుకుంటుండగా వికాస్, ఆశిష్‌లు తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఆ మరుసటిరోజు రాత్రి జరిగిన వేధింపులు, కిడ్నాప్ యత్నం ఘటనను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై 354డీ తోపాటు మోటారు వెహికల్ యాక్ట్‌లోని ఐపీసీ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. -
గుర్గావ్లోనూ యువతిని వెంటాడారు..
గుర్గావ్: చండీగర్ వీధుల్లో వర్ణికా కుందుకు ఎదురైన అనుభవమే గుర్గావ్లో ఓ యువతికి ఎదురైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఓ యువతి(25) విధులను ముగించుకుని స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా ఇద్దరు దుండగలు కారులో ఆమెను వెంటాడారు. మూడు కిలోమీటర్ల మేర యువతిని అనుసరించినవాళ్లు ఆమె వాహనాన్ని ఆపాల్సిందిగా కేకలు వేశారు. దుండగులు వెంబడిస్తున్నట్టు గమనించిన బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే తనను వెంబడించిన కారు నెంబర్ ఆమెకు గుర్తురాలేదు. కేవలం హెచ్ఆర్-57 అనే నెంబర్లు మాత్రమే యువతి చెప్పగలుగుతున్నదని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీస్ కమీషనర్ సందీప్ కిర్వార్ కార్యాలాయానికి వెళ్లిన బాధితురాలు ఘటనపై ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయితే తప్ప దర్యాప్తులో తాము పురోగతి సాధించలేమని పోలీసులు పేర్కొనడం గమనార్హం. చండీగఢ్‌లో వర్ణికా కుందు అనే యువతిని హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా తన ఎస్‌యూవీలో వెంటాడి వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో గుర్గావ్లో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. -
రాత్రివేళల్లో అబ్బాయిలకేం పని: నటి
చండీగఢ్: హర్యాణాలో ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుందును రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా వేధించిన ఘటనపై బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంట్లో కుర్చోపెట్టాల్సింది అమ్మాయిలను కాదని అబ్బాయిలనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కేసుతో రాజకీయాలకు ముడిపెట్టడం భావ్యం కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అమ్మాయిలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని, వారిని రాత్రివేళల్లో బయటికి పంపకూడదని.. అయినా రాత్రివేళల్లో రోడ్లపై వారికి ఏం పని ఉందన్న మరో బీజేపీ ఎంపీ రాంవీర్ భట్టి వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఓ యువతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు.. ఆయనకు నోరెలా వచ్చిందంటూ మండిపడ్డారు. 'కేవలం రాత్రివేళల్లోనే ఎందుకు ఇలా జరుగుతోంది. పగలు ఈ దుర్మార్గాలు తక్కువన్న విషయం పక్కనపెడితే.. రాత్రివేళల్లో బయటకు రాకుండా ఉండాల్సింది అమ్మాయిలు కాదు, అబ్బాయిలు. యువకులకు రాత్రిపూట రోడ్లపై ఏం పని ఉంది. వారిని ఆ సమయంలో ఇంట్లో కూర్చోపెడితే ఈ సమస్యలే తలెత్తవని' ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను చండీగఢ్‌లో లేనని, తాను ఎంపీని మాత్రమేనని, డీఐజీనో.. గవర్నర్‌నో కాదన్నారు. కానీ ప్రతి వివాదంలోనూ నేత మనీశ్ తివారీ తనను లాగుతున్నారని చెప్పారు. ఈ కేసును విచారిస్తున్న లుథార బాధితురాలికి న్యాయం చేస్తారని ఆకాంక్షించారు. కేసును నీరుగార్చే యత్నాలు జరగలేడం లేదని కిరణ్ ఖేర్ వివరించారు. -
వికాస్ అరెస్ట్.. 'నా కొడుకైనా శిక్ష పడాల్సిందే'
చండీగఢ్ : ఎట్టకేలకు వేధింపుల కేసులో హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తనయుడు వికాస్ బరాలాను పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్‌లోని సెక్టార్ 26 పోలీస్ స్టేషన్లో అతడిని కట్టుదిట్టమైన భద్రత మధ్య అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయమే 11గంటలకు అతడు స్టేషన్‌కు హాజరుకావాలని సమన్లు ఇచ్చినప్పటికీ దాదాపు మూడు గంటలపాటు ఆలస్యంగా చివరకు పోలీసుల ముందుకు రావడంతో అతడిని అరెస్టు చేశారు. దీంతో ఐదు రోజులపాటు సాగిన ఉత్కంఠ ఇక విచారణ దశకు చేరింది. వికాస్ స్టేషన్‌కు రావడానికి ముందే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన తండ్రి సుభాష్ బరాలా తన కుమారుడిని విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. అతడు మార్గం మద్యలో ఉన్నాడని వివరించారు. 'నేరస్తులను తప్పనిసరిగా శిక్షించాలి.. అది నా కుమారుడైనా సరే. ఆ అమ్మాయి నా కూతురితో సమానం. విచారణకు వెళ్లాల్సిందేనని నేను చాలా స్పష్టంగా మా వాడికి చెప్పాను' అని చెప్పారు. మరోపక్క, పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ వికాస్ నేరం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అతడిని అరెస్టు చేసేందుకు సరిపోతాయని అన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పేందుకు వికాస్ సిద్ధంగా ఉన్నాడట. కావాలని ఆ రోజు వెంబడించలేదని డ్రైవింగ్ చేసే వ్యక్తి పురుషుడా, యువతినా అనే విషయంపై బెట్ కాయడం వల్లే అది తెలుసుకునేందుకు కారును అనుసరించినట్లు చెప్పాడని సమాచారం. వికాస్ బరాలా, అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్ ఓ ఐఏఎస్ అధికారి కూతురు అయిన వర్ణికా కుందును కారులో వెంబడించి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు పెను ధుమారాన్ని రేపింది. -
వేధింపుల కేసు: షాకిచ్చిన వికాస్
- యూరిన్, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరణ - నోటీసులు కూడా తీసుకోని నిందితుడు ఛంఢీగడ్: యువతిని వెంటాడి వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న హరియాణా బీజేపీ చీఫ్ తనయుడు వికాస్ బరాలా పోలీసులకు షాకిచ్చాడు. విచారణలో భాగంగా వెళ్లిన అధికారులకు రక్త, మూత్ర నమునాలు ఇచ్చేందుకు నిరాకరించాడు. నిందితులిద్దరూ న్యాయ విద్యార్థులు, పైగా చట్టాల అవగాహన ఉండటంతో అందుకు నిరాకరించారని డీజీపీ లుథారా మీడియాకు తెలిపారు. కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరు ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీలను పరిశీలించాం. అందులో యువతిని నిందితులు వెంబడించినట్లు స్పష్టమయ్యింది. అదనపు సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. విచారణను వేగవంతం చేశామని, త్వరగతిన బాధితురాలికి న్యాయం చేకూరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు నిందితులు వికాస్ బరాలా మరియు అశిశ్ కుమార్ లను బుధవారం ఉదయం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే వికాస్ మాత్రం నోటీసులు అందుకునేందుకు నిరాకరించటంతో ఇంటి గేటుకు అంటించారు. మొత్తం వ్యవహారంపై స్పందించిన వికాస్ తండ్రి, హరియానా బీజేపీ చీఫ్ సుభాష్బరాలా.. బాధిత యువతి వర్ణికా కుంద్రా తన కూతురులాంటిదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విచారణ పారదర్శకంగా జరిగేందుకు సహకరిస్తానని, తనవైపు నుంచి ఎలాంటి (అధికార) ఒత్తిళ్లు ఉండబోవని స్పష్టం చేశారు కూడా. వేధింపులతోపాటు ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద వికాస్ పై కేసులు నమోదు అయ్యాయి. -
'నా క్యారెక్టర్ ఎవ్వరూ వేలెత్తి చూపలేరు'
పంచ్‌కులా(హరియాణా): తనపై జరుగుతున్న రాజకీయ దాడులకు వర్ణికా కుందూ మరోసారి గట్టిగా బదులిచ్చారు. తన వ్యక్తిత్వం గురించి వేలేత్తి చూపే అర్హత ఏ ఒక్కరికీ లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను ఏ సమయంలో ఎక్కడికి వెళ్లానేది ఏ ఒక్కరికీ సంబంధించింది కాదు. ఈ విషయాన్ని బట్టే ఓ మహిళ వ్యక్తిత్వం నిర్ణయించలేరు. ఇలాంటి పనులే ఒకబ్బాయి చేస్తున్నప్పుడు అతడిని ఏ ఒక్కరూ ప్రశ్నించరు. అబ్బాయిలు చేసే పనులే అమ్మాయిలు చేయాలనుకున్నప్పుడు మాత్రం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు వేధిస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మహిళలు బాహాటంగా వ్యతిరేకించాల్సిందే' అని ఆమె అన్నారు. మరోపక్క, సోషల్ మీడియాలో ఆమెను కించపరుస్తూ వస్తున్న వీడియోలు, ఫొటోలు, వ్యతిరేక ప్రచారంపై స్పందిస్తూ ఇలాంటి వాటికి తాను భయపడతానని, తన క్యారెక్టర్‌ను దిగజార్చినట్లవుతుందనుకోవడం పొరపాటని అన్నారు. ఒక వేళ ఎవరైనా అలాంటి పోస్టింగులు చేస్తే అది వారి వ్యక్తిత్వాన్ని బయటపెట్టినట్లవుతుందే తప్ప తనది కాదన్నారు. రాత్రి కారులో వెళుతున్న వర్ణికా కుందును హరియాణా బీజేపీ చీఫ్ సుబాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా అతడి స్నేహితుడు వెంబడించి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, అర్థరాత్రి పూట ఆమెకు అసలు ఏం పని అని, ఒంటరిగా ఎందుకు బయటకు వెళ్లిందంటూ కొంతమంది బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంతోపాటు సోషల్ మీడియాలో కూడా ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె మరోసారి స్పందించారు. -
'అర్థరాత్రి వెళితే నీకెందుకు.. అది నాపని'
చండీగఢ్: అర్ధరాత్రి ఆమె ఎందుకు బయటకు వెళ్లిందంటూ హరియాణా బీజేపీ చీఫ్ కుమారుడు, అతడి స్నేహితుడి చేతిలో వేధింపులు ఎదుర్కొన్న వర్ణికా కుందుపై వ్యాఖ్యలు చేసిన హరియాణా బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్‌వీర్ భట్టిపై వర్ణికా తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకు వెళ్లాననేది ప్రశ్నించడానికి ఆయన ఎవరు అంటూ ధ్వజమెత్తారు. అలా ప్రశ్నించడం ఆయన పనికాదని, అది తన వ్యక్తిగతం, తన కుటుంబానికి సంబంధించిన విషయం అని అన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలనేది తన వ్యవహారం అంటూ గట్టిగా బదులిచ్చారు. చండీగఢ్‌లో శుక్రవారం రాత్రి బాధితురాలు వర్ణికా కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాల కొడుకు వికాస్ బరాలా, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్యూవీ వాహనంలో తరిమారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దాదాపు 8 జంక్షన్ల వరకు ఆమెను ముప్పు తిప్పలు పెట్టారు. ఈ విషయం పెద్ద దుమారం రేగడంతో ఆమెకు అర్ధరాత్రి ఏం పనంటూ పుండుమీద కారంజల్లినట్లుగా బీజేపీ నేత మాట్లాడారు. దీంతో వర్ణికా సోమవారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'అది ఆయన పని కాదు.. ఎక్కడ, ఏం చేయాలనేది నాకు సంబంధించిన విషయం నా కుటుంబానికి సంబంధించిన విషయం. రాత్రి పూట అలా జరిగితే అది నా తప్పా? రాత్రి పూట పురుషులు నియంత్రణలో ఉండరా? నన్నెందుకు అస్సలు ప్రశ్నిస్తున్నారు? నేను దాడికి గురైన బాధితురాలిని వారు నన్ను ప్రశ్నించకూడదు? ఇప్పుడు నన్ను నేను రక్షించుకున్నాను కాబట్టి ఏదో తప్పయి ఉంటుంది క్షమించండి అని అంటున్నారు. నిజానికి నాకు ఏదైనా అయి ఉంటే ఎవరికి వారు క్షమాపణలు చెబుతారు? అసలు వీరు సమాజాన్ని ఏ కోణంలో చూస్తున్నారు? ఒంటిరిగా మహిళ కనిపించకూడదా? ఒంటరిగా ఉన్న మహిళ మద్యం సేవించకూడదా? రాత్రి ఒక మహిళ తన స్నేహితులైన అబ్బాయిలతో ఉండి మత్తులో ఉంటే ఇక ఆమె తనపై లైంగిక వేధింపులకు ఆహ్వానించినట్లా? అంటూ దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో కడిగి పారేశారు. ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో మద్దతు స్వరం వినిపిస్తోంది. -
కేసును నీరుగార్చేందుకే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మహిళను వేధించిన కేసులో హరియాణా బీజేపీ చీఫ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ తీరును కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. సీసీటీవీ కెమేరాలు పనిచేయడం లేదని చెబుతూ సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేదని పోలీసులు ప్రకటించడం కుట్రపూరితమని ఆ పార్టీ ప్రతినిధి, హర్యానా కాంగ్రెస్ నేత రూపేంద్ర సింగ్ సుర్జీవాలా ఆరోపించారు. బీజేపీ చీఫ్ సుభాష్ బరాలను, ఆయన కుమారుడు వికాస్ బరాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం హర్యానా ప్రభుత్వ యంత్రాంగంతో కుమ్మక్కైందని అన్నారు. పోలీసులు చెబుతున్న విధంగా ఏడు సీసీ టీవీ కెమెరాల్లో ఐదు పనిచేయకపోవడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా అవి ఎందుకు పనిచేయలేదు..? కీలకమైన సాక్ష్యాన్ని నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చారని సందేహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి కుమార్తెను బరాల అతని స్నేహితుడు మద్యం మత్తులో వెంటాడిన విషయం విదితమే. ఈ కేసులో అరెస్ట్ అయిన వీరిద్దరూ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. -
'గర్విస్తున్నా.. నీది గొప్ప నిర్ణయం తల్లి'
న్యూఢిల్లీ: తనను నడిరోడ్డుపై వెంబడించి వేధించారంటూ హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాల కొడుకు వికాస్ బరాలాపై ఫిర్యాదు చేయడంతోపాటు ఈ కేసు విషయంలో పోరాటం తీవ్రతరం చేసిన బాధితురాలు వర్ణికా కుందుకు ఆమె తండ్రి ఐఏఎస్ అధికారి వీరేందర్ కుందు మరింత అండగా నిలిచారు. ఆమె తీసుకున్న నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. మన సమాజంలో పేరుకుపోయిన దురాభిమానంపై నువ్వు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నందుకు గర్వంగా ఉంది. ఈ కేసు ద్వారా ఒక ఐఏఎస్ అధికారిని అయిన తనకు ఎలాంటి సమస్యలు వస్తాయోనని నువ్వు అస్సలు ఆలోచించకు. నా జీవితానికి ఈ కేసుకు ముడిపెట్టుకొని భయపడకు' అంటూ ఆమెకు ధైర్యం నూరి పోశారు. ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులను విడిచిపెట్టకూడదని, వారికి శిక్షపడాల్సిందేనని ఆయన ఫేస్బుక్లో రాసుకొచ్చారు. ప్రశాంతంగా ఉన్న జీవితాలు గందరగోళంగా మారుతాయేమోనని నేరస్తులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని ఆయన పోస్ట్‌లో చెప్పారు. హరియాణాలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న వీరేందర్ కుందు కుమార్తె ఒంటరిగా కారులో వెళుతుండగా వికాస్ బారాల అతడి స్నేహితుడు వేధించే ప్రయత్నం చేశారు. ఆమెను నడిరోడ్డుపై వెంటాడారు. చండీగఢ్‌లో శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్యూవీ వాహనంలో తరిమారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలంలోనే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఇద్దరు నిందితుల్ని బెయిల్‌పై విడుదల చేశారు. రాజకీయ ప్రాబల్యమున్న కుటుంబానికి చెందిన నిందితులపై పోలీసులు కిడ్నాప్ అభియోగాలు నమోదుచేయకపోవడంతో హరియాణాలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
షాకింగ్: ఆ వీడియోలు మాయం!
న్యూఢిల్లీ: హరియాణ బీజేపీ చీఫ్ కొడుకు యువతిని వేధించిన కేసులో షాకింగ్ పరిణామం.. ఈ కేసుకు సంబంధించి ఐదు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా దృశ్యాలు మాయమవ్వడం కలకలం రేపుతోంది. హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలా గత శుక్రవారం ఓ యువతిని కారులో వెంబడించి వేధించిన సంగతి తెలిసిందే. అతను కారులో యువతిని వెంబండించిన ఐదు ప్రదేశాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలు మాయయ్యాయి. ఈ కేసు విచారణలో ఈ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్న తరుణంలో ఇవి కనిపించడం లేదని పోలీసులు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ కేసులో బాధితురాలైన ఐఏఎస్ అధికారి కూతురినే బీజేపీ రాష్ట్ర శాఖ నిందించడం గమనార్హం. అర్ధరాత్రి బాధితురాలు ఒంటరిగా ఎందుకు వెళ్లిందంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంవీర్ భట్టీ పేర్కొన్నారు. 'అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె బయటకు వెళ్లాల్సింది కాదు. ఆమె ఒక్కరే కారు నడుపుకుంటా అంత రాత్రి ఎందుకు వెళ్లింది?' అని భట్టీ ప్రశ్నించారు. చండీగఢ్‌లో గత శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్యూవీ వాహనంలో ఆమెను వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. అప్పటికే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. తను ఐఏఎస్ అధికారి కూతురిని అయినందుకు దుండగుల నుంచి తప్పించుకున్నానని, తానొక సామాన్యుడి కూతురిని అయి ఉంటే తనపై అత్యాచారం జరిగి, హత్య జరిగి ఉండేదేమోనని బాధితురాలు ఫేస్బుక్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజకీయ ప్రాబల్యమున్న నిందితులకు బెయిల్ ఇచ్చి.. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
'అదృష్టవంతురాలిని నన్ను రేప్ చేయలేదు'
హరియాణ బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కొడుకు వికాస్ చేతిలో వేధింపులు ఎదుర్కొన్న బాధితురాలు తాజాగా తన అభిప్రాయాలను ఫేస్బుక్లో వెల్లడించారు. తాను సామాన్యుడి బిడ్డను అయితే ఈ కేసును ఇంత సీరియస్‌గా తీసుకొని ఉండేవారు కాదేమోనని ఆమె తెలిపారు. ఐఏఎస్ అధికారి కూతురు అయిన ఆమె గత శుక్రవారం రాత్రి తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరించారు. 'ఆ రాత్రి నేను ఎంతో భయపడ్డాను. నా చేతులు వణికాయి. భయంతో వెన్ను జలదరించింది. ఒకవైపు విస్మయం.. ఇంకోవైపు కళ్లలో నీళ్లు.. నేను ఈ రోజు ఇంటికి వెళుతానా? లేదో తెలియని భయం. పోలీసులు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలుసు' అంటూ ఆమె వివరించారు. 'గతరాత్రి చండీగఢ్ రోడ్డుమీద దాదాపు కిడ్నాప్ అయ్యేదాన్ని' అంటూ ఆమె శనివారం పెట్టిన పోస్టును ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంతోమంది ఈ పోస్టును షేర్ చేసుకుంటున్నారు. 'సామ్యానుడి కూతురిని కాకపోవడం నా అదృష్టమేమో.. ఎందుకంటే, అలాంటి వీఐపీలను సామాన్యులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? నాపై రేప్, హత్య వంటి దుర్మార్గాలు జరగకపోవడం కూడా నా అదృష్టమే అనుకుంటున్నా' అని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే బలమైన రాజకీయ ప్రాబల్యమున్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు వెంటాడి వేధించారని ఆమె తెలిపారు. ఆమెను నడిరోడ్డుపై వెంటాడి వేధించిన కేసులో బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలాతోపాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లో శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్యూవీ వాహనంలో వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలంలోనే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఇద్దరు నిందితుల్ని బెయిల్‌పై విడుదల చేశారు. రాజకీయ ప్రాబల్యమున్న కుటుంబానికి చెందిన నిందితులపై పోలీసులు కిడ్నాప్ అభియోగాలు నమోదుచేయకపోవడంతో హరియాణలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కొడుకు తప్పు చేస్తే.. తండ్రిని శిక్షించాలా?
హిస్సార్ (హరియాణ): తన కొడుకు ఓ యువతిని వెంటాడి వేధించిన కేసులో విపక్షాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న బీజేపీ హరియాణ చీఫ్ సుభాష్ బరాలాకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అండగా నిలిచారు. కొడుకు తప్పు చేస్తే తండ్రిని శిక్షించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. 'ఈ కేసు గురించి నాకు తెలిసింది. చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు చర్య తీసుకుంటారని నేను భావిస్తున్నా. ఇది సుభాష్ బారాలకు సంబంధించిన విషయం కాదు. ఒక వ్యక్తికి సంబంధించింది. ఆయన కొడుకుకు వ్యతిరేకంగా చర్య తీసుకుంటాం' అని సీఎం విలేకరులతో తెలిపారు. యువతిపై వేధింపుల కేసులో సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలాతోపాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లో ఓ యువతి శుక్రవారం రాత్రి కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు ఆశిష్‌తో కలిసి తమ ఎస్యూవీ వాహనంలో వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె ఏ మాత్రం భయపడకుండా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలంలోనే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ చీఫ్ సుభాష్ బరాలాపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆయనను బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
ఫుల్లుగా తాగి.. కారుతో యువతిని ఛేజ్ చేసి!
యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడి కుమారుడు సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బారాలా కుమారుడు వికాస్ బరాలాతోపాటు అతని స్నేహితుడు ఆశిష్ కుమార్ శుక్రవారం రాత్రి ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం శనివారం బెయిల్‌పై వికాస్ విడుదలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. చండీగఢ్‌లో ఓ యువతి శుక్రవారం రాత్రి ఓ కారులో తన ఇంటికి వెళ్తున్నారు. మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు అశిష్తో కలిసి తమ ఎస్యూవీ వాహనంతో వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరిస్తున్నా ఏ మాత్రం భయపడకుండా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి విషయాన్ని చెప్పారు. వారు అక్కడికి చేరుకునేలోగా ఆమె ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు కారు నడిపినా చివరికి ఆమెను నిలువరించి వేధించడం మొదలుపెట్టారు. సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు వికాస్ తో పాటు అశిష్లను అరెస్ట్ చేశారు. సెక్టర్ 26లోని పీఎస్‌లో కేసు నమోదుచేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని శనివారం బెయిల్‌పై విడుదల చేసినట్లు చండీగఢ్ డిప్యూటీ ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడించారు. యువతి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డు చేశారని తెలిపారు. నిందితులపై 354డీ తోపాటు మోటారు వెహికల్ యాక్ట్‌లోని ఐపీసీ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేశామన్నారు.